చంద్రుడిపై పక్షం రోజుల చీకటి తర్వాత పగటి కాంతులు పర్చుకుంటున్నాయి. ఇది భారతదేశపు ఇస్రో చంద్రయాన్ 3కు నిజంగానే ఉషోదయం అయింది. చంద్రయాన్ 3లో భాగంగా చంద్రుడిపైకి వెళ్లిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లను నిద్రాణ స్థితి నుంచి తట్టిలేపి, తిరిగి ప్రయోగాల కార్మోన్ముఖం చేసేందుకు ఇస్రో భూ కేంద్రం నుంచి సశాస్త్రీయ ప్రక్రియలు చేపట్టారు.
చంద్రుడి ఉపరితలంపై అత్యంత తీవ్రస్థాయి గడ్డకట్టిన వాతావరణంలో విక్రమ్, ప్రజ్ఞాన్లు నిద్రావస్థలోకి వెళ్లాయి. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఇవి తిరిగి చంద్రుడిపై పగటి కాంతి విస్తరించుకునే పక్షం రోజుల వ్యవధిలో మునుపటి చేతనావస్థకు చేరాలి. చీకటి దశ తరువాత పదిహేను రోజులు విస్తరించుకుని ఉండే సూర్యుడి కాంతి కిరణాల సాయంతో ఈ రెండు ప్రక్రియలు తిరిగి పనిచేస్తాయి.
రోవర్, ల్యాండర్లు వీటికి అమర్చి ఉండే పలు రకాల బ్యాటరీ ఇంధన ఛాలక పరికరాల పునఃచైతన్య ప్రక్రియను ఆరంభించినట్లు, గ్రౌండ్ స్టేషన్ నుంచి ఈ దిశలో వీటికి తగు సంకేతాలను పంపిస్తున్నట్లు బుధవారం బెంగళూరులోని ఇస్రో కార్యాలయ అధికారులు తెలిపారు. చంద్రుడిపై పూర్తిస్థాయిలో సూర్యకాంతి అందుబాటులోకి రావడం జరిగితే ఇవి తిరిగి పనిచేయడం సాధ్యం అవుతుందని ఇస్రో ఆశిస్తోంది.
ఇవి తిరిగి పనిచేస్తే పక్షం రోజుల పాటు వీటి ద్వారా చంద్రుడిపై పరిశోధనలకు దారితీస్తుంది. మొత్తం మీద అంతా అనుకూలిస్తే గురు లేదా శుక్రవారానికి ఇవి పనిచేయాల్సి ఉంటుంది. వీటి పునరుద్ధరణ అవకాశాలు పెద్దగా లేవు. అయితే దీనిపై ఆశలు అడుగంటలేదని , ఇవి నిద్రలేవడం జరిగితే గొప్ప పరిణామం అవుతుందని ఇస్రో తెలిపింది.
వీటిని చేతనావస్థకు తీసుకురావచ్చు కానీ ఇంతకు ముందులాగా ఇవి పూర్తి స్థాయిలో పనిచేయలేవు. ఒకవేళ రెండు రోజులలో ఇవి పనిచేసే స్థాయికి రాకపోతే ఇవి చంద్రుడిపై చంద్రయాన్ 3లో గుర్తులుగా ఉండాల్సిందే. చంద్రయాన్ 3 మాడ్యూల్స్ చంద్రుడి ఉపరితలంపై ఒక్క లూనార్ డే అంటే భూమిపై లెక్కలో ఉండే 14 రోజుల వరకూ సౌరశక్తితో ఇంధన జ్వలితంతో పనిచేస్తాయి.
చంద్రుడిపై చీకటి దశలో మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ స్థాయి అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతలను తట్టుకుని నిలిచే ఎలక్ట్రానిక్ మాడ్యూల్స్ రూపకల్పన ఇంతవరకూ జరగలేదు. అత్యల్ప ఉష్ణోగ్రతలు నెలకొని ఉండే చంద్రుడి దక్షిణ ధృవంలోనే ఇప్పుడు చంద్రయాన్ నౌక దిగింది.