భారత్ కెనడాకు ఊహించని షాక్ ఇచ్చింది. కెనడా వాసులకు వీసాల జారీని భారత్ నిరవధికంగా నిలిపివేసింది. ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ రేపిన చిచ్చు మరింత తీవ్రతరం దాలుస్తున్నట్టు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి.
కెనడా కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా, భారత్ కు చెందిన ఇంటెలిజెన్స్ హెడ్ ను తమ దేశం నుంచి బహిష్కరించడం తెలిసిందే. దీంతో భారత్ సైతం కెనడా సీనియర్ దౌత్యవేత్తను దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది.
దీనికి కొనసాగింపుగా భారత్ లోని కశ్మీర్లో కిడ్నాప్ లు, అల్లర్లు, అశాంతి, ఉగ్రవాద చర్యల నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లే కెనడా పర్యాటకులు జాగ్రత్తగా వ్యవహరించాలంటూ కెనడా సూచనలు చేసి మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. కెనడాలో మారిన పరిణామాల నేపథ్యంలో భారత సంతతి వారు తమ భద్రత విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలంటూ భారత్ సైతం సూచనలు జారీ చేసింది.
కెనడా వాసులకు వీసా సేవలను నిరవధికంగా నిలిపివేయడంపై భారత్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాలేదు. కాకపోతే వీసా సేవలను ఔట్ సోర్స్ రూపంలో అందించే బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ తన కెనడియన్ వెబ్ సైట్ లో ఇందుకు సంబంధించి ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది. కెనడాలో వీసా కేంద్రాలను బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ నిర్వహిస్తోంది.
‘‘భారత మిషన్ నుంచి ముఖ్యమైన సందేశం. నిర్వహణ కారణాల రీత్యా సెప్టెంబర్ 21 నుంచి భారత వీసా సేవలను తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు నిలిపివేయడమైనది’’అని పేర్కొంది. దీనిపై భారత్ కు చెందిన ఓ అధికారి అనధికారికంగా మాట్లాడుతూ.. వీసా సేవల నిలిపివేతను ధ్రువీకరించారు.
మరో ఖలిస్థాన్ ఉగ్రవాది హత్య
ఇదే సమయంలో కెనడాలో మరో ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాది హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. ఖలిస్థాన్ ఉగ్రవాది అర్షదీప్ సింగ్ అలియాస్ అర్ష దాలా అనుచరుడైన సుఖ్దూల్ సింగ్ కెనడాలోని విన్నిపెగ్ పట్టణంలో హత్యకు గురయ్యాడు. రెండు గ్యాంగుల మధ్య గొడవలో భాగంగా ఇది చోటు చేసుకుంది.
ఏ-కేటగిరీ గ్యాంగ్ స్టర్ అయిన సుఖ్దూల్ సింగ్ గతంలో పంజాబ్ నుంచి కెనడాకు పరారైన వ్యక్తి. అతడిపై ఏడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఫోర్జరీ డాక్యుమెంట్ల ఆధారంగా 2017లో పాస్ పోర్ట్ సంపాదించి కెనడాకు పారిపోయాడు. ఇందుకు ఇద్దరు పోలీసులు సహకరించారు. అనంతరం ఆ ఇద్దరు పోలీసుల అరెస్ట్ కు గురయ్యారు.
ఈ ఏడాది జూన్ లో ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురికాగా, దీని వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడూ ఆరోపించడం తెలిసిందే. ఇది రెండు దేశాల మద్య దౌత్య యుద్ధానికి దారితీసింది. ఇదే సమయంలో మరో ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాది హత్యకు గురికావడం గమనార్హం.