ఏపీ అసెంబ్లీ సమావేశాలు సవాళ్లు, సస్పెన్షన్లతో ప్రారంభమైనాయి. తొలిరోజైన గురువారం నాడే టిడిపి సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. చంద్రబాబు అరెస్టుపై ఉభయ సభల్లోనూ టిడిపి సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలు తిరస్కరణకు గురైనాయి. దీంతో వాటిపై చర్చకు టిడిపి సభ్యులు పట్టుబట్టారు.
శాసనసభలో స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో వైసిపి రెబల్ సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, టిడిపి సభ్యులు అనగాని సత్యప్రసాదు స్పీకర్పోడియంపైకి వెళ్లారు. స్పీకర్ మైక్‌ను పీకేశారు. టేబుల్‌పై ఉన్న గ్లాసు కూడా పలిగింది. వారిద్దరినీ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ రూలింగు ఇచ్చారు.
ఆ సమయంలోనే వైసిపి సభ్యులకు, బాలకృష్ణకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాలకృష్ణ చూస్తుండగా వైసిపి సభ్యులు తొడకొట్టారు. దీనికి స్పందించిన బాలకృష్ణ మీసం తిప్పారు. అదే సమయంలో రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు ‘రా.. చూసుకుందాం’ అనడం వినిపించింది. ఈ దశలోసభలో ఉన్న టిడిపి సభ్యులందరిని ఒక్కరోజు సస్పెండ్ చేశారు.
15వ అసెంబ్లీ 11వ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలుత చంద్రబాబు అరెస్టు అక్రమమని, దీనిపై చర్చించాలని కోరుతూ అసెంబ్లీలోనూ, మండలిలోనూ ప్రతిపక్ష సభ్యులు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. వీటిని స్పీకర్, మండలి ఛైర్మన్ తిరస్కరించారు.
ఈ సమయంలో అసెంబ్లీలో టిడిపి సభ్యులు, వారితోపాటు వైసిపి రెబల్ సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితరులు సైకో సిఎం పోవాలంటూ నినాదాలు చేశారు. మరోవైపు అధికార పక్ష సభ్యులు మధుసూదనరెడ్డి, నాగార్జున తదితరులు కూడా ప్రతిగా కేకలు వేశారు.
అప్పటికే టిడిపి సభ్యులు పోడియంపైకెళ్లి స్పీకర్ ఛైర్‌ను చుట్టుముట్టారు. కొద్దిసేపు నినాదాలతో అసెంబ్లీ గందరగోళంగా మారింది. నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలోనే టిడిపి సభ్యులు వారి చేతుల్లో ఉన్న కాగితాలు చించి స్పీకర్‌పై వేశారు.
టిడిపి సభ్యులు పోడియం పైకి వెళ్లి నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో హిందుపురం ఎంఎల్ఏ బాలకృష్ణకు, వైసిపి సభ్యులకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడుతో కలిసి బాలకృష్ణ పోడియం ముందు నిలబడి నిరసన వ్యక్తం చేస్తుండగా, వైసిపి సభ్యులు తొడకొట్టి సవాలు చేశారు.
దీంతో బాలకృష్ణ మీసంపై చేయివేశారు. దీనికి అధికారపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్‌ను అవమానించారని, రూలింగ్ ఇవ్వాలని పట్టుబట్టారు. బాలకృష్ణకు, టిడిపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ దశలో జోక్యం చేసుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం బాలకృష్ణ మీసం మెలేశాడని, ఇది సభా సాంద్రాయాలకు విరుద్ధమని ప్రకటించారు.
అయితే, తొలి తప్పుగా భావించి హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో వైసిపి సభ్యులు టిడిపి సభ్యుల వద్దకు దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. అప్పటికే మంత్రి అంబటి రాంబాబు జోక్యం చేసుకుని మీసం మేలేస్తున్నారేంటి రా చూసుకుందాం… అంటూ కేకలు వేశారు.
వైసిపి సభ్యులు టిడిపి సభ్యుల మీదకు వస్తుండటంతో మార్షల్స్ పెద్దఎత్తున చుట్టుముట్టి టిడిపి సభ్యులకు రక్షణగా నిలబడ్డారు. స్పీకర్ కూడా అధికారపక్ష సభ్యులను వారించారు.