రైల్వేల ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ అన్నారు. స్వయం ఆధారిత స్వయం సుస్దిరతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. రైలు ప్రయాణం, రైలు మౌలిక సదుపాయాల నవీకరణకు సంబంధించి 2023 ఎంతో కీలకమైందని ఆమె పేర్కొన్నారు.
విజయవాడ – చెన్నై మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ఆమె విజయవాడ రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వేలో తాజాగా ప్రారంభిస్తున్న వందేభారత్ రైలు మూడోదని చెప్పారు. రైలును ప్రారంభించిన అనంతరం ప్రయాణికులు, పిల్లలతో ఆమె మాట్లాడారు.
రైలులో సౌకర్యాలు ఎలా ఉన్నాయి? తదితర వివరాలను డాక్టర్ భారతితోపాటు విజయవాడ ఎంపి కేశినేని నాని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిఆర్ఎం నరేంద్ర ఎ పాటిల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడిఆర్ఎం డి.శ్రీనివాసరావు, ఎడిఆర్ఎం ఆపరేషన్స్, ఎం.శ్రీకాంత్ పాల్గొన్నారు.
కేంద్ర పధకాలను ప్రజలకు చేరువ చేయాలి
కాగా, కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలను సోషల్ మీడియా వలంటీర్లు ప్రజలకు చేరువ చేయాలని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. విశాఖలోని సాగరమాల ఆడిటోరియంలో బిజెపి సోషల్ మీడియా వలంటీర్ల సమావేశం ఆదివారం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రధాని మోదీ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు.
బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను పురంధరేశ్వరి ఎండగడుతుంటే కొంతమంది ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పదేళ్లుగా బెయిల్పై ఉన్న విషయాన్ని వైసిపి నాయకులు గుర్తెరగాలని హితవు చెప్పారు. రాష్ట్రంలోని పరిణామాలను కేంద్రం గమనిస్తోందని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపి జివిఎల్.నరసింహారావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధరేశ్వరి పాల్గొన్నారు.