ప్రధాని నరేంద్ర మోదీ ఒకే వారంలో రెండు సార్లు తెలంగాణకు రానున్నారు. అక్టోబర్ 1న మహబూబ్‌నగర్, 3న నిజామాబాద్ జిల్లాలకు ప్రధాని రానున్నారు. రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొంటారు. ప్రధాని రాక సందర్భంగా ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారు.
ఆదివారం మధ్యాహ్నం 11.20 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి ఐఏఎఫ్ ప్రత్యేక విమానంలో బయల్దేరి మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. బేగంపేట సమీపంలోని ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్, రైల్వే, ఇతర శాఖల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో ప్రధాని పాల్గొంటారు.
మధ్యాహ్నం 2.30 గంటలకు బేగంపేట నుంచి ఎంఐ-17 ప్రత్యేక హెలీకాప్టర్‌లో బయల్దేరి మధ్యాహ్నం 3.05 గంటలకు మహబూబ్‌నగర్‌కు చేరుకుంటారు. మహబూబ్‌నగర్ శివార్లలోని భూత్పూర్లో మధ్యాహ్నం 3.15 నుంచి 4.15 గంటల వరకు జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు మహబూబ్‌నగర్ హెలీపాడ్ నుంచి హెలీకాప్టర్‌లో 5.05 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 5.10 గంటలకు ఐఏఎఫ్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు పయనమవుతారు.
అక్టోబర్ 3న మరోసారి రాష్ట్రానికి మోదీ అక్టోబర్ 3న ప్రధాని మోదీ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. పర్యటనలో భాగంగా నిజామాబాద్‌లో రోడ్‌షో, బహిరంగసభలో పాల్గొంటారు. నిజామాబాద్‌లో పసుపుబోర్డుకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
అక్టోబర్ 3వ తేదీన నిజామాబాద్ పట్టణంలోని జిజి గ్రౌండ్ లో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి పరిశీలించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్షేత్రస్థాయిలో దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. .
ప్రధాని పర్యటనలో 800మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన రూ. 6 వేల కోట్ల విలువైన ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ను మోదీ వర్చువల్ గా ప్రారంభిస్తారని పేర్కొన్నారు.