హైదరాబాద్ నగరంలోని బండ్లగూడలో వినాయకుడి లడ్డూ భారీ ధర పలికింది. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాలో వినాయకుడి లడ్డూ రికార్డు స్థాయిలో రూ.1.26కోట్లు పలికింది. ఇప్పటివరకు బాలాపూర్ గణేష్ లడ్డూ ధర రికార్డు స్థాయిలో పలికేది.
గతేడాది బాలాపూర్ గణేష్ లడ్డూ రూ.24.60లక్షల ధర పలికింది. ప్రస్తుతం బాలాపూర్ గణేష్ లడ్డూ ధరను బ్రేక్ చేస్తూ బండ్లగూడ వినాయకుడి లడ్డూ ధర రికార్డు స్థాయిలో రూ.1.26 కోట్లు పలికింది. మరోవంక, బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలం పాటలో లడ్డూను తుర్కయాంజిల్కు చెందిన దాసరి దయానంద్ రెడ్డి పాడుకున్నారు. లడ్డూ ప్రసాదాన్ని తన తల్లితండ్రులకు కానుకగా ఇస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది కూడా వేలంలో పాల్గొన్నా రూ.22లక్షల రుపాయల వద్ద వేలంలో తాను ఆగిపోయినట్లు చెప్పారు.
బాలాపూర్ లడ్డూ వేలం పాట ఆసక్తికరంగా సాగింది. గత ఏడాది లడ్డూను వేలంలో రూ.24.60లక్షలకు విక్రయించారు. ఈ ఏడాది రూ.27లక్షల ధర పలికింది. వచ్చే ఏడాది నుంచి లడ్డూ వేలంలో కీలక మార్పులు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
ఉత్సవ కమిటీ తీర్మానం ప్రకారం వచ్చే ఏడాది నుంచి వేలంలో లడ్డూ పాడుకున్న వారు అదే ఏడాది డబ్బులు చెల్లించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు వేలం సొమ్ములు చెల్లించడానికి గడువు ఇచ్చే వారు. ఇకపై వేలం సొమ్మును అదే ఏడాది చెల్లించాలని నిర్ణయించారు.
కాగా, హైదరాబాద్‌లో గణేష్ విగ్రహాల శోభయాత్ర ప్రారంభమైంది. వీధివీధి నుంచి గణనాథుడి విగ్రహాలు నిమజ్జనానికి బారులు తీరాయి. రేపు ఉదయం వరకు ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది. ఖైరతాబాద్, బాలాపూర్ విగ్రహాలు కూడా నిమజ్జనం కోసం బయల్దేరాయి.
గురువారం ఉదయం 6 గంటలకే ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది. దీంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సిసి కెమరాలతో ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రస్తుతం తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్దకు గణేష్ శోభాయాత్ర చేరుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు క్రేన్ నెంబర్ 4 వద్ద హుస్సేన్ సాగర్ లో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తికానుంది. ఆ తరువాత మిగతా వినాయకుల నిమజ్జన కార్యక్రమం జరగనుంది. కాగా, గణనాథుల నిమజ్జనానికి నగరంలో 100చోట్ల అధికారులు నీటికొలనులు సిద్ధం చేశారు.
వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సుమారు 40 వేలకు మంది పోలీ సు సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. 19 కిలోమీటర్ల పాటు గణేష్ విగ్రహాల శోభాయాత్ర సాగనుంది. బాలాపూర్ నుండి హుస్సేన్ సాగర్ వరకు వినాయక వి గ్రహాల శోభాయాత్ర సాగనుంది.
బాలపూర్ గణేష్ విగ్రహం నుండి శోభాయాత్ర ప్రారంభం కానుంది. వినాయక విగ్రహాల శోభాయాత్రలో ఖైరతాబాద్ వినాయక విగ్రహాం ప్రధానమైంది. వినాయక విగ్రహాల శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. హుస్సేన్ సాగ ర్, సరూర్ నగర్, సఫిల్‌గూడ, కాప్రా, నల్లచెరువు, ఎదులాబాద్లలోని చెరువుల్లో వినాయక విగ్రహాల నిమజ్జ నం ప్రధానంగా కొనసాగుతుంది.
వినాయక నిమజ్జనోత్సవాల సందర్భంగా అర్ధరాత్రి 2 గంటల వరకు హైదరాబాద్ మెట్రో సర్వీసులను అందుబాటులో ఉండబోతున్నట్లు ప్రకటించింది. ఈ సేవలను భాగ్యనగర వాసులు ఉపయోగించుకోవాలని మెట్రో విభాగం సూచించింది. అలాగే ఖైరతాబాద్, లక్డీకపూల్, గాంధీ భవన్, నాంపల్లి మెట్రో స్టేషన్లలో అదనపు సిబ్బందిని నియమించారు. హైదరాబాద్‌కు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జంటనగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.