పదకొండు రోజుల పాటు ఆ బాల గోపాలంతో పూజలందుకొని భాగ్యనగరంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపిన గణపయ్యలు గురువారం వీడ్కోలు తీసుకున్నారు. భక్తిశ్రద్ధలతో నగరవాసులు ధూప దీప నైవేద్యాలను సమర్పించి లంబోదరులను నిమజ్జనం చేశారు. నగరవ్యాప్తంగా ప్రతిష్టితమైన దాదాపు 90వేల గణపతుల నిమజ్జనం శుక్రవారం ఉదయం వరకు జరిగింది.
63 అడుగుల ఎైత్తెన ఖైరతాబాద్ మహాగణపతి మధ్యాహ్నం ఒంటిగంట 27 నిమిషాలకు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. బాలాపూర్ నుంచి ప్రారంభమై చార్మినార్, ఆబిడ్స్, బషీర్‌బాగ్ మీదుగా ట్యాంక్‌బండ్ చేరిన శోభాయత్ర ఉత్సవ విగ్రహాలు, భక్తులతో పోటెత్తింది.
‘కత్తులు బల్లెము చేతబట్టి.. దుష్టుల తలలు మూటగట్టి.. నువ్వు పెద్దపులి నెక్కిరావమ్మో… గండిపేట ఓ మైసమ్మ… ఓ మైసమ్మో’ అంటూ ఊపున్న పాటలకు ఊగిపోతూ నగర యువకులు సందడి చేశారు. తీన్మార్ డప్పుల మోతకు చిన్నా పెద్ద, మహిళలు లయబద్ధంగా స్టెప్పులు వేశారు.
గణేశ నిమజ్జనం సందర్భంగా ఆధ్యాత్మిక పారవశ్యంలో హైదరాబాద్ నగరం ఓలలాడింది. గల్లీ నుంచి ట్యాంక్‌బండ్ వరకు ఎటుచూసినా భక్తజనమే. ఊరేగింపు కొనసాగిన రహదారి మొత్తం పండుగ కళతో శోభిల్లింది. గణపతుల వెంట సాగిన యువతీ, యువకులు, గులాల్ చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు. జయజయధ్వానాలతో పరిసరాలను మార్మోగించారు.
నిమజ్జనం వైభవంగా జరిగేలా అటు జీహెచ్ఎంసీ, ఇతర విభాగాలు ఇటు మూడు కమిషనరేట్ల పోలీసులు అన్ని ఏర్పాట్లు చేయడంతో అవాంఛనీయ ఘటనలేవీ జరగలేదు.కాగా ఈ సారి గణపతి లడ్డూలకు అనూహ్యమైన పోటీ పెరిగింది. బండ్లగూడ జాగీర్ పరిధిలోని సన్‌సిటీ రిచ్మండ్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో నిర్వహించిన లడ్డు ఏకంగా కోటి 26 లక్షలు, ప్రతిష్టాత్మక బాలాపూర్ లడ్డు 27 లక్షలు పలికాయి.
ఎక్కువ ఎత్తున్న విగ్రహాలతో వచ్చిన శకటాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అందరి చూపు ఖైరతాబాద్, బాలాపూర్ గణనాథుల నిమజ్జనోత్సవంపైనే. ఆ బృహత్తర ప్రక్రియను వీక్షించడానికి గురువారం భక్తులు పోటీపడ్డారు. ఆ గణనాథులను తమ సెల్ఫోన్లో క్లిక్‌మనిపించారు. వెళ్లి రావయ్యా.. బొజ్జ గణపయ్యా అంటూ ఘనంగా వీడ్కోలు పలికారు.
శోభాయాత్ర పొడవునా జైజై గణేశా.. బైబై గణేశా.. గణపతి బప్పా మోరియా అంటూ స్మరించారు. భక్తులకు మార్గం పొడవును స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక సంఘాలు ఆహార పదార్థాలు, తాగునీరు అందించారు. నిమజ్జనోత్సవం సందర్భంగా విద్యాసంస్థలకు, కార్యాలయాలకు గురువారం సెలవు ప్రకటించడంతో కుటుంబ సమేతంగా ట్యాంక్‌బండ్‌కు విచ్చేశారు.
ఖైతరాబాద్ గణేశుడి శోభాయాత్రను ప్రత్యక్ష్యంగా చూస్తూ ఆనందం పొందారు. డ్యాన్సింగ్ గణేశా, మ్యూజికల్ గణేశ, బుల్లెట్ గణేశా, చిట్టి బాహుబలి గణేశా, సిక్స్‌ప్యాక్ గణేశా తదితర విభిన్న రూపాల్లో లంబోదరుడు కనువిందు చేశాడు. కొందరు వాహనాలపై తీసుకొస్తే మరి కొందరూ పల్లకీలో తీసుకొచ్చి నిమజ్జనం చేశారు. సాయంత్రం అయ్యేకొద్ది అత్యధిక విగ్రహాలు ట్యాంక్‌బండ్‌కు తరలివచ్చాయి. యువతులు, యువకులు తీన్మార్ స్టెప్పులతో ధూంధాం చేశారు. డ్రెస్ కోడ్‌తో అలరించారు.