టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు నోటీసులు ఏపీ సిఐడి అధికారులు జారీ చేశారు. ఢిల్లీలోని గల్లా జయదేవ్ ఇంట్లో ఉన్న లోకేష్ కు శనివారం సిఐడి అధికారులు స్వయంగా నోటిసులు ఇచ్చినట్లు మీడియాకు తెలిపారు. ఏ కేసులో నోటీసులు ఇచ్చారని లోకేష్ ప్రశ్నించగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో 41ఏ కింద లోకేష్ కు నోటీసులు ఇచ్చినట్లు ఏపీ సిఐడి అధికారులు తెలిపారు.
అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విచారణకు తాడేపల్లి సిఐడి కార్యాలయంలో హాజరుకావాలని తెలిపారు. వాట్సాప్ లో నోటీసులు పంపారు కదా.. మళ్లీ ఎందుకు వచ్చారని అధికారులను లోకేష్ ప్రశ్నించారు. 41-3, 41-4 సెక్షన్ల గురించి వివరించాలని లోకేష్ కోరగా, సిఐడి అధికారులు వివరించారు.
సాక్ష్యాలను ట్యాంపరింగ్ చేయనని లోకేష్ పేర్కొన్నారు. నోటిసులు క్షుణ్ణంగా చదువుకొని, విచారణకు హాజరు అవుతానాని లోకేష్ తెలిపారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ ఏ14గా ఉన్నారని విషయం విదితమే. విచారణ నిమిత్తం లోకేష్‌ను విజయవాడలోని సీఐడీ ఆఫీసుకు రావాలని పిలిచినట్టు అధికారులు తెలిపారు.
కాగా, అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ డిజైన్ల ముసుగులో అప్పటి ప్రభుత్వ పెద్దలు భూకబ్జాలకు పాల్పడ్డారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి పొంగూరు నారాయణ, చంద్రబాబు సన్నిహితులు, వ్యాపారవేత్తలు లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ డైరెక్టర్ అంజనీకుమార్ తదితరులను నిందితులుగా చేర్చారు. చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్‌ను కూడా 14వ ముద్దాయిగా చేర్చారు.
2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష
మరోవంక, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. నంద్యాలలో శనివారం జరిగిన టిడిపి పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, యనమల సహా ఇతర సభ్యులు పాల్గొన్నారు.
ఈ సమావేశానికి నారా లోకేష్ ఢిల్లీ నుంచి జూమ్ కాల్ ద్వారా హాజరయ్యారు. చంద్రబాబు అరెస్ట్ నుంచి ఇప్పటి వరకు చోటుచేసుకున్న పరిణామాలు, తదుపరి చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశం అనంతరం భవిష్యత్తు కార్యాచరణను అచ్చెన్న ప్రకటించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ అక్టోబర్ 2 రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ప్రతి ఇంట్లో లైట్లన్నీ ఆపేసి ప్రజలు నిరసన తెలపాలని కోరారు. లైట్లు ఆపి వరండాలో కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేయాలని పిలుపిచ్చారు.