రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2,000 డినామినేషన్ నోట్ల మార్పిడికి గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించాలని నిర్ణయించింది. మే 19న తిరిగి చలామణి నుంచి రూ. 2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత తాజాగా, ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు రూ. 2వేల నోట్ల మార్పిడికి గడువు సెప్టెంబర్ 30గా నిర్ణయించిన విషయం తెలిసిందే.
అయితే, “సమీక్ష ఆధారంగా, రూ. 2000 నోట్ల డిపాజిట్/మార్పిడి కోసం ప్రస్తుత ఏర్పాటును అక్టోబర్ 07 వరకు పొడిగించాలని నిర్ణయించాం” అని ఆర్బిఐ తెలిపింది. అప్పటి వరకు “రూ. 2000 నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతాయి” అని ఆర్బిఐ తెలిపింది. మే 19 నాటికి చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్ల మొత్తం విలువ రూ. 3.56 లక్షల కోట్లలో రూ. 3.42 లక్షల కోట్లు విజయవంతంగా బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చినట్లు కేంద్ర బ్యాంక్ వెల్లడించింది.
ఇవి సెప్టెంబర్ 29, 2023 నాటికి ఇప్పటికీ రూ. 0.14 లక్షల కోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయి. 19 ఆర్బిఐ ఇష్యూ కార్యాలయాల్లో రూ. 2000 నోట్లను డిపాజిట్/మార్పిడి చేసుకునే సదుపాయం తదుపరి సలహా వరకు అందుబాటులో ఉంటుందని ఆర్బిఐ పేర్కొంది. ప్రజలు రూ. 2000 నోట్లను “ఇక ఎలాంటి ఆలస్యం లేకుండా” డిపాజిట్/మార్పిడి చేసుకోవాలని కోరింది.
అక్టోబరు 8 నుంచి రూ. 2,000 నోట్లను డిపాజిట్ చేసే లేదా మార్చుకునే విధానంలో మార్పు ఉంటుందని ఆర్బీఐ తెలిపింది .బ్యాంకు శాఖలు డిపాజిట్ లేదా మార్పిడి కోసం రూ.2,000 నోట్లను స్వీకరించడం మానేస్తాయి.వ్యక్తులు, సంస్థలు ఇప్పటికీ ఆర్బీఐ 19 ప్రాంతీయ కార్యాలయాల వద్ద రూ. 2,000 నోట్లను మార్చుకునే అవకాశం ఉంటుంది, ఒకేసారి రూ. 20,000 పరిమితి ఉంటుంది.