ఒక అవకాశం ఇవ్వండి అని పాదయాత్రలో ముద్దులు పెట్టి మురిపింపజేస్తే నమ్మిన ప్రజలను దెయ్యంలా పట్టిపీడిస్తోన్న జగన్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. నాలుగో విడత వారాహి విజయయాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం కృష్ణా జిల్లా అవనిగడ్డ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.
సిపిఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులను, మద్యపాన నిషేధం అమలు చేస్తానని మహిళలను, మెగా డిఎస్సి ప్రకటిస్తానని ఉపాధ్యాయ అభ్యర్థులను, ప్రతి ఏటా జాబ్ కేలండర్ విడుదల చేస్తానని నిరుద్యోగ యువతను జగన్ మోసగించారని విమర్శించారు. ముఖ్యమంత్రి అవకాశం వస్తే తప్పకుండా స్వీకరిస్తానని, సమర్థవంతంగా సుపరిపాలన అందిస్తానని స్పష్టం చేశారు.
జగన్ పదేపదే మాట్లాడే ‘వై నాట్ 175 కాదు… ఈసారి వచ్చేది 15 స్థానాలు మాత్రమే. చూసుకోండి’ అని జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన-టీడీపీ కలిసి పని చేస్తాయని, మార్పు కావాలని కోరుకుంటే వెసిపిని తరిమి కొట్టడమే మన కర్తవ్యం కావాలని చెప్పారు.
“జగన్ తన మంత్రివర్గాన్నంతా ఒకే సామాజిక తరగతితో నింపేయడం, కేవలం కాపు సామాజిక నాయకులతో నన్ను తిట్టించడం, నా సినిమాలను ఆపేయడం వల్ల నాకు ఏమీ నష్టం లేదు. నాకు డబ్బు మీద ఆశలేదు. వైసిపి వారు ఎన్ని తిట్టినా ధైర్యంగా ఎదుర్కొంటా” అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిన జగన్… 3.88 లక్షల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి డ్రాప్ అవుట్ అయ్యేలా చేశారని విమర్శించారు. రాష్ట్రం నుంచి వలసలు పెరిగాయని, ఈ ఘటన జగన్‌దేనని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సర్వే చేపట్టి తద్వారా వచ్చిన గణాంకాలను తాను చెబుతున్నానని తెలిపారు.
ప్రభుత్వానికి దమ్ముంటే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. చుట్టూ కృష్ణా నది పాయల మధ్య విస్తరించిన దివిసీమ ప్రాంతంలో 87 ఫ్లోరైడ్ బాధిత గ్రామాలున్నాయని, దాదాపు నాలుగు 1.50 లక్షల నివాసాలకు తాగునీటి కొళాయి కలెక్షన్ లేదని జలజీవన్ మిషన్ లెక్కలు చెబుతున్నాయని తెలిపారు.
దాదాపు గంటసేపు ప్రసంగించిన పవన్ కల్యాణ్ ముగింపు మాటలుగా ‘సంత్ కబీర్ దాసు’ వ్యాఖ్యలను ఉదాహరించారు విత్తనంలో నూనె ఉన్నట్లుగా, చెకుముకి రాయిలో నిప్పు ఉన్నట్లుగా, నీవు మార్పును బలంగా కోరితే మంచి భవిష్యత్తు చూడగలరని ఉద్ఘాటించారు.