తెలుగు రాష్ట్రాల్లో 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఎ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్ఐఎ అధికారులతోపాటు పోలీసుల బృందం కలిసి ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లోని పౌరహక్కుల నేతలు, కులనిర్మూలన సమితి, చైతన్య మహిళా సంఘాల నేతలు, అమరబంధు మిత్రుల సంఘం నాయకుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
వాళ్ల కుటుంబ సభ్యులనూ ప్రశ్నిస్తున్నారు. మావోయిస్టులతో సంబంధాలు, వాళ్ల కార్యకలాపాలకు సహకరిచండంపై విచారణ చేపట్టారు. మావోయిస్టు సానుభూతిపరులుగా ముద్రపడినవారితోపాటు, పౌరహక్కులు, ప్రజాసంఘాల్లో పనిచేస్తున్న పలువురి నివాసాలను జల్లెడపడుతున్నారు.
హైదరాబాద్లో భవాని, న్యాయవాది సురేశ్ ఇళ్లలో ఎన్ఐఎ అధికార తనిఖీలు చేపట్టారు. వరంగల్లోని హంటర్ రోడ్డులో చైతన్య మహిళా మండలి సభ్యులు అనిత, శాంతమ్మ ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరులోని ఉస్మాన్ సాహెబ్పేటలో ఎల్లంకి వెంకటేశ్వర్లు, తిరుపతిలో క్రాంతి చైతన్య ఇండ్లలో ఎన్ఐఏ అధికారులు తనిఖీ చేశారు.
గుంటూరు జిల్లా పొన్నూరులో ఎన్ఐఎ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ వైద్యుడు, జిల్లా పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు రాజారావు ఇంట్లో ఈరోజు వేకువజాము నుంచే తనిఖీలు చేస్తున్నారు. కామామానులో మండలం కొండపాటూరులోని తమలపాకుల సుబ్బారావు నివాసంలో సోదాలు జరుగుతున్నాయి.
పౌరహక్కుల సంఘం నేత రాజారావుకు సన్నిహితంగా ఉండే సుబ్బారావు, ప్రజాతంత్ర పార్టీ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. ఆయన మావోయిస్ట్ సానుభూతిపరుడనే అనుమానంతో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అనంతపురం బిందెల కాలనీలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు, కుల నిర్మూలన సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు ఇంట్లో ఎన్ఐఎ సోదాలు జరుగుతున్నాయి.
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం అల్లిపురంలో జిల్లా కుల నిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు కావలి బాలయ్య ఇంట్లో తనిఖీలు సాగుతున్నాయి. మాజీ సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డిపై బాంబు దాడి కేసులో… కావలి బాలయ్య కుమార్తె పద్మ, అల్లుడు శేఖర్ నిందితులుగా ఉన్నారు.
నెల్లూరులోని ఎపిసిఎల్సి ప్రధాన కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు నివాసంలో అధికారులు సోదాలు చేపట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో జాతీయ దర్యాప్తు సంస్థ- ఎన్ఐఎ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంగళగిరి మండలం నవులూరులో చైతన్య మహిళా వేదిక సభ్యురాలు సిప్పోరా ఇంటితోపాటు తాడేపల్లి మండలం డోలాస్ నగర్ ప్రాంతాల్లో ప్రజాసంఘాల నాయకుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
తాడేపల్లి మహానాడు 13వ రోడ్డులో ఉంటున్న బత్తుల రమణయ్య నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. బాపట్ల జిల్లా సంతమాగులూరుకు చెందిన ఓర్సు శ్రీనివాసరావు నివాసంలో సోదాలు సాగుతున్నాయి. కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసరావును విచారిస్తున్నారు.
నెల్లూరు ఫతేఖాన్ పేట రైతుబజార్ సమీపంలో చైతన్య మహిళా సంఘం నేత అన్నపూర్ణమ్మ ఇంట్లో సోదాలు సాగుతున్నాయి. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో కుల నిర్మూలన పోరాట సమితి నాయకుడు దుడ్డు వెంకట్రావు, సంతమాగులూరులో ఓరు శ్రీనివాసరావు, రాజమహేంద్రవరంలోని బమ్మేరులో పౌర హక్కుల నేత నాజర్, హార్లిక్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి కోనాల లాజర్, శ్రీకాకుళంలో మిస్కా కృష్ణయ్య ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. కృష్ణయ్య ఆమదాలవలస మండలం తోటవాడ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన ఇంటిలో తనిఖీలు చేపట్టారు.