ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన జనసేన మొత్తం 32 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించింది. కూకట్పల్లి, ఎల్బీనగర్, వైరా, ఖమ్మం, నాగర్కర్నూల్, మునుగోడు, కుత్బుల్లాపూర్, శేర్లింగంపల్లి, పటాన్చెరు, సనత్నగర్, కొత్తగూడెం, ఉప్పల్, అశ్వరావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్ ఘన్పూర్, హుస్నాబాద్, రామగుండం, జగిత్యాల, నకిరేకల్, హుజూర్నగర్, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, ఖానాపూర్, మల్కాజిగిరి, మేడ్చల్, పాలేరు, ఇల్లందు, మధిరలో జనసేన పోటీ చేయనున్నట్లు పేర్కొంది.
తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్న జనసేన స్థానాలను ఆ పార్టీ ఉపాధ్యక్షులు బోంగునూరి మహేందర్ రెడ్డి ప్రకటిస్తూ తెలంగాణ ఎన్నికల్లో పోటీ అంశంపై పూర్తి సన్నదతతో ఉన్నామని తెలిపారు. ఈసారి పోటీలో జనసేన ఉంటుందని, ఒకవేళ చివరి క్షణంలో పొత్తులు ఏమైనా ఉంటే స్థానాల్లో మార్పు రావచ్చని పేర్కొన్నారు. సింగిల్ గా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
గత 10 సంవత్సరాల్లో అనేక సమస్యలపై తెలంగాణలో జనసేన పార్టీ పోరాటం చేసిందని చెబుతూ నల్లమల యురేనియం తవ్వకాలు, మహిళలపై దాడులు, డ్రగ్స్ సమస్య, ఆర్టీసీ కార్మికుల సమస్య, బీసీ, ఎస్టీ వర్గాల సమస్యలు, విద్యార్థుల సమస్యలు ఇలా అనేక సమస్యలపై జనసేన పార్టీ పోరాటం చేసిందని వివరించారు.
ఈ 32 నియోజకవర్గాల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని చెబుతూ పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేయనున్నారని ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ప్రధానంగా జనసేన పార్టీ పోటీ చేయనుందని మహేందర్ రెడ్డి తెలిపారు. పార్టీ క్యాడర్ బలంగా ఉన్న 32 నియోజకవర్గాల్లో ఇప్పటికే కమిటీలు వేశామని, అక్కడ పార్టీ బలంగా పనిచేస్తుందని చెప్పారు.