మంత్రి రోజాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణను గుంటూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ మేరకు సత్యనారాయణ మూర్తికి నోటీసులు అందజేశారు. 41ఏ, 41బీ సెక్షన్ల కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు.
మంత్రి రోజాపై బండారు అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ నేతలు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇంటివద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్న బండారు సత్యనారాయణకు వైద్య పరీక్షలు చేయించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. ఆయన ఇంటికి తీసుకొచ్చిన ప్రైవేట్ అంబులెన్స్‌ను పోలీసులు అడ్డుకున్నారు. లోపలకు పంపేందుకు నిరాకరించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు, పోలీసులకు వాగ్వాదం జరిగింది.
గుంటూరు పోలీసులు నోటీసులతో బండారు సత్యనారాయణ ఇంటికి చేరుకోవడంతో అక్కడికి భారీగా చేరుకున్న టీడీపీ కార్యకర్తలు, మహిళలు పోలీసులను అడ్డుకున్నారు. బండారు సత్యారాయణపై రెండు కేసులు నమోదు చేశారు. ముఖ్యమంత్రి జగన్, మంత్రి రోజాను దూషించారని కేసులు నమోదు చేశారు. అయితే బండారు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఆదివారం అర్దరాత్రి బండారును అరెస్టు చేసేందుకు విశాఖలోని ఆయన ఇంటికి వెళ్లారు. అయితే ఇంట్లోకి మాత్రం వెళ్లలేదు. అలాగే బండారు ఇంటికి టీడీపీ నేతల్ని కూడా అనుమతించలేదు. దీంతో దాదాపు 15 గంటల పాటు ఉత్కంఠ కొనసాగింది.
బండారును ఇంట్లోనుంచి రానివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం, ఇతర ఆంక్షలపై ఆయన భార్య మాధవీలత పోలీసుల్ని ఆశ్రయించి కేసు పెట్టారు. బండారును ఏ క్షణంలో అయినా అరెస్టు చేసేందుకు వీలుగా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. చివరకు పోలీసులు ఈ సాయంత్రం అరెస్టు చేసి గుంటూరుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.