సీఎం జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. సీఎం జగన్ ఒంట్లో పావలా దమ్ము లేదంటూ రాష్ట్రంలో రాబోయేది జనసేన-టీడీపీ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. కృష్ణా జిల్లా పెడనలో వారాహి యాత్రలో పాల్గొంటూ ఓట్లు కోసమే వైసీపీ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని ఆరోపించారు.
డబ్బులిస్తే అభివృద్ధి జరిగినట్టా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి మార్గాలేవి? అని నిలదీశారు. తాను పదవులపై ఆశపడి ఉంటే 2009లోనే ఎంపీ పదవిలో ఉండేవాడినని చెప్పారు. నిధుల మళ్లింపులో ఏపీదే అగ్రస్థానమని కేంద్రం చెబుతోందని పేర్కొంటూ వైసీపీ ప్రభుత్వం ఉపాధి కూలీల పొట్ట కొట్టిందని ఆరోపించారు. రూ. 336 కోట్ల నిధులను దారి మళ్ళించారని ఆరోపణలు గుప్పించారు.
ఈ ప్రభుత్వంపై ప్రశ్నించే వారిపై పలు రకాల కేసులు పెడుతున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఎక్కువ రాజద్రోహం కేసులు ఏపీలోనే పెడుతున్నారని పెక్రోన్నారు. ఇలాంటి కేసులకు భయపడితే తాను రాజకీయాల్లోకి ఎందుకు వస్తానని పవన్ ప్రశ్నించారు. జగన్ ఏపీ బంగారు భవిష్యత్తు కాదు, ఆయనో విపత్తు అని విమర్శించారు.
రాష్ట్రంలో 28 లక్షల ఇళ్లు కడతామని చెప్పి 3 లక్షల ఇళ్లే కట్టారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇళ్ల పేరుతో రూ.4 వేల కోట్లు దోచేశారని ధ్వజమెత్తారు. ప్లాస్టిక్‌పై నిషేధం పేరుతో తన ప్లెక్సీలను మాత్రమే నిషేధించారని పవన్ మండిపడ్డారు. తన సినిమాలు, పుట్టినరోజు వచ్చినప్పుడే ప్లాస్టిక్‌పై వైసీపీ వాళ్లకు నిషేధం గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు.
రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు వైసీపీ తరిమికొట్టాలని పవన్ కళ్యాణ్ పిలుపిచ్చారు. ఏపీ ప్రజలు గర్వంగా తలెత్తుకుని బతికేలా చేయడమే తన ఆశయం అని చెప్పారు. పెడనలో జనసేన కార్యకర్తలను కట్టి కొట్టారని మండిపడుతూ వాటన్నింటికీ స్థానిక ఎమ్మెల్యే జోగి రమేష్ సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుందని హెచ్చరించారు. 39 కేసుల్లో నిందితుడైన జగన్ రాజకీయాలకు అనర్హుడని మండిపడ్డారు. జగన్ ను ఎప్పటికీ రాజకీయాల్లోకి రానివ్వకూడదు అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.