ఎన్నికల షెడ్యూల్ జారీకి ముందే అనూహ్యంగా తెలంగాణాలో నగదు లభ్యత కష్టమవుతోంది. కట్టలు కట్టలుగా కనిపించిన నగదంతా ఒక్కసారిగా మార్కెట్లో కనిపించకుండా పోయింది. తాజాగా రూ.2వేల నోట్ల ఉపసంహరణ తర్వాత ఆ స్థానాన్ని రూ.500 నోటు కైవసం చేసుకున్నది.
రాష్ట్రంలో బ్యాంకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, మద్యం దుకాణాల్లో మాల్స్‌లో, ఇతర దైనందిన కార్యక్రమాలనుంచి ప్రతీ దగ్గర ప్రజలవద్ద భారీగా నగదు కనిపించేది. డిజిటల్ పేమెంట్ల తర్వాత కూడా నగదుకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన తెలంగాణ ప్రజానీకానికి ఒక్కసారిగా నగదు కష్టాలు ఎదురవుతున్నాయి.
ఇందుకు కారణం ఎన్నికలు తరుముకురావడమేనని మార్కెట్ వర్గాలు, ఆర్ధిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికలకు అర్ధ బలాన్ని పెంచుకునే పార్టీలు, నేతలు ఇప్పటికే భారీగా నగదును తమ తమ రహస్య స్థావరాల్లో బదీ చేస్తున్నారనే ప్రచారం పెరుగుతోంది.
తాజాగా రాష్ట్రంలో మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు, ప్రభుత్వ వేలంలో ప్లాట్లు కొన్న బడా సంస్థలు కూడా డబ్బులు పుట్టక లోదిబోమంటున్నాయి. గతంలో కరోనా తర్వాత ప్రజలు తమ వద్ద నగదు నిల్వ చేసుకునేందుకు ప్రాధాన్యతనిచ్చారు.
2020-21లో కరెన్సీ చెలామణి జీడీపీలో గరిష్టంగా 14.5శాతానికి ఎగబాకింది. అనిశ్చితి, అభద్రతాభావాల నేపథ్యంలో అప్పుడు నగదు దాచేయగా, ఇలా రూ.3.3 లక్షల కోట్లు ప్రజలచేతుల్లో బందీ అయ్యాయి. ఆ తర్వాత ప్రభుత్వ చర్యలతో డిజిటల్ పేమెంట్ల వైపు మొగ్గిన ప్రజలు నగదును మార్కెట్లోకి వదిలారు.
దీంతో నగదుకు కొరత లేకుండా పోయింది. కానీ ఇప్పుడు మళ్లి నగదు కష్టాలు మొదలయ్యాయి. నేతలు, పార్టీలు జోరుగా నగదును నిల్వ చేసుకుంటున్నాయనే ప్రచారం పెరుగుతోంది. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో హుజూరాబాద్, మునుగోడులలో రికాస్డు స్థాయిలో వ్యయాలు చేసిన పార్టీలు ఇప్పుడు రాష్ట్రమంతటా ఇది ట్రెండ్‌ను ఫాలో అవనున్నారనే ఆందోళన పెరుగుతోంది.
ఇదిలా ఉండగా ఇందుకు బలం చేకూర్చేలా రియల్ రంగంలో పెట్టుబడులు తగ్గాయి. రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గముకం పడుతోంది. నిర్మాణ రంగంలో మార్కెట్ స్థబ్దుగా మారింది. కొనుగోలుదారులు లేక భారీ బహుళ అంతస్తుల ఆకాశహర్మ్యాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బ్యాంకుల్లో నగదు జమలు 50 శాతం తగ్గినట్లుగా రికార్డులు వెల్లడిస్తున్నాయి.
విత్ డ్రాయల్ రేటు పెరిగిందని బ్యాంకర్లు చెబుతున్నారు. గడచిన నెల రోజులుగా బ్యాంకుల్లో నగదు జమ 20శాతంగా ఉంటే ఉపసంహరణలు 1000 శాతం మేర పెరిగినట్లు బ్యాంకర్ల నివేదికలో వెల్లడైంది. ఇలా లక్షల కోట్లు ఎక్కడికి తరలివెళ్తున్నాయనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఇదంతా ఎన్నికలకు కాస్త ముందు కావడంతో సహజంగానే పార్టీలు, నేతలపై అనుమానాలకు బలం చేకూరుతోంది.