ఏపీ మంత్రి, నటి రోజాపై అనుచిత వాఖ్యలు చేసి, అరెస్ట్ అయి, ప్రస్తుతం బెయిల్ పై విడుదలైన టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణపై ప్రముఖ నటీమణులు తీవ్రంగా మండిపడుతున్నారు. మంత్రి రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలైన వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ సభ్యురాలు, నటి నవనీత్ కౌర్, రాధిక, ఖుష్బూ సహా పలువురు టీడీపీ నేత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాజాగా నటి మీనా, రమ్యకృష్ణ స్పందించారు. ఒకరి తరువాత మరొకరు బండారును లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా హీరోయిన్ మీనా ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందిస్తూ బండారు వెంటనే రోజాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. మంత్రి రోజా సినీ పరిశ్రమకు వచ్చిన సమయం నుంచి తనకు తెలుసని చెబుతూ రోజా చిత్తశుద్దితో హార్డ్ వర్క్ చేసే మహిళగా ఆమె పేర్కొన్నారు.
రోజా నటిగా, తల్లిగా, రాజకీయ నాయకురాలిగా, మహిళగా అన్నింటా విజయవంతమైన వ్యక్తిగా ఆమె అభివర్ణించారు. మంత్రి రోజా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా మాట్లాడే హక్కు బండారు లేదని మీనా ఆగ్రహం వ్యక్తం చేసారు.బండారు లాంటి వాళ్లు ఇలాంటి మాటలు మాట్లాడినంత మాత్రాన మహిళలు భయపడిపోతారుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
ఇదే అంశం పైన రమ్యకృష్ణ స్పందిస్తూ మహిళలపై శారీరక, మానసిక హింసను అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. రోజాపై ఇష్టారీతిన మాట్లాడిన బండారుపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. భారత మాతాకి జై అని గర్వంగా చెప్పుకొనే మన దేశంలో ఒక మహిళపై ఇం నీచంగా మాట్లాడుతారా? అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
కులాలు, మతాలు, ప్రాంతాలు, జెండర్ తో సంబంధం లేకుండా బండారు వ్యాఖ్యలను అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ఒక మహిళగా, నటిగా, స్నేహితురాలిగా మంత్రి రోజాకు అండగా ఉంటానని చెప్పారు.
ఇదే అంశం పైన టీడీపీ మాజీ మహిళా నేత కవిత స్పందిస్తూ మహిళా మంత్రి రోజా పై బండారు హేయంగా మాట్లాడారని మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను భువనేశ్వరి, బ్రాహ్మణి వెంటనే ఖండించాలని ఆమె డిమాండ్ చేసారు. దరిద్రపు మాటలు ఎలా మట్లాడారో తెలియటం లేదని ఆమె వాపోయారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన బండారు పై చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేసారు.