అంతరిక్ష ప్రయోగాల్లో అద్భుత విజయాలతో దూసుకెళ్తున్న భారత్.. త్వరలో తన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర (గగన్‌యాన్)ను చేపట్టేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రయోగానికి అవసరమైన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్-క్రూ మాడ్యూల్ (ఐఏడీటీ-సీఎం) స్ట్రక్చర్‌ను ఇటీవల ఇస్రోకు అందజేసినట్టు చెన్నైకి చెందిన కేసీపీ లిమిటెడ్ సంస్థ ఆదివారం వెల్లడించింది.
సాంకేతిక సన్నద్ధతను పరీక్షించుకునేందుకు 2 ఐఏడీటీ క్రూ మాడ్యూల్ స్ట్రక్చర్లను రూపొందించే బాధ్యతను కేసీపీకి ఇస్రో అప్పగించింది. వీటిలో 3,120 కిలోల బరువైన తొలి ఐఏడీటీ-సీఎం 3.1 మీటర్ల వెడల్పు, 2.6 మీటర్ల పొడవు ఉంటుంది.
అల్యూమినియంతో తయారైన ఈ స్ట్రక్చర్‌లో పారాచ్యూట్ సిస్టమ్, పైరోస్, ఏవియానిక్స్, బొయాన్సీ ఆగ్మెంటేషన్ సిస్టమ్ లాంటి ప్రధాన ఉప వ్యవస్థలతోపాటు వివిధ రకాలైన 100కుపైగా భాగాలు ఉంటాయి. గగన్‌యాన్‌లో భాగంగా ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులను క్రూ మాడ్యూల్ ద్వారా భూమికి 400 కిలోమీటర్ల ఎగువన ఉండే కక్ష్యలోకి తీసుకెళ్లి 3 రోజుల తర్వాత సురక్షితంగా తిరిగి సముద్ర జలాల్లో దింపుతారు.
కేసీపీ సంస్థ రూపొందించిన ఐఏడీటీ-సీఎం గగన్‌యాన్‌లో ఉపయోగించే వాస్తవ మాడ్యూల్ ఆకారాన్ని, పరిమాణాన్ని పోలి ఉంటుంది. గగన్‌యాన్‌కు ముందు డిసిలరేషన్ సిస్టమ్ (పారాచ్యూట్, పైరో) పనితీరును ధ్రువీకరించుకునేందుకు భారత వైమానికదళ హెలికాప్టర్ ద్వారా ఐఏడీటీ-సీఎంను దాదాపు 4 కి.మీ. ఎత్తు వరకు తీసుకెళ్లి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ నిర్వహిస్తారు.