ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అసైన్డ్ భూముల కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అసైన్డ్ భూముల కేసులో సిఐడి సరికొత్త ఆధారాలు బయటకు తీసుకొచ్చింది. రాజధానిలో అసైన్డ్ భూముల కుంభకోణం జరిగిందని ఎంఎల్ఎ ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు.
అసైన్డ్ భూముల కొనుగోలులో నిబంధనలకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ, ఇతరులు వ్యవహరించారనే అభియోగాలు నమోదయ్యాయి. వీటి పైన సీఐడీ విచారణలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు విచారణ జరగకుండా మార్చి 19న హైకోర్టు స్టే ఆదేశాలు ఇచ్చింది. ఆ తరువాత కేసును కొట్టేయాలంటూ నారాయణ సైతం క్వాష్ పిటిషన్ దాఖలు చేసారు.
క్వాష్ పిటిషన్పై విచారణ తరువాత అక్టోబర్ 16కు తీర్పు వాయిదా పడింది. ఈ క్రమంలోనే మళ్లీ రీ ఓపెన్ చేయాలని సిఐడి తాజా పిటిషన్ దాఖలు చేసింది. విచారణ ముగిసిందని భావిస్తున్న వేళ..మాజీ మంత్రి నారాయణ మరదలు కృష్ణప్రియ ఇచ్చిన ఆధారాలు ఇప్పుడు సీఐడీకి అస్త్రంగా మారాయి. దీంతో, ఈ వ్యవహారం ఇప్పుడు టీడీపీ నేతల్లో కొత్త టెన్షన్ కు కారణమవుతోంది. ఈ కేసుకు సంబంధించి సీఐడీకి కృష్ణప్రియ కొన్ని ఆడియో, వీడియో ఆధారాలు అందజేశారని తెలుస్తోంది.
ఇందులో నారాయణ, తదితరులు ఏ విధంగా భూములు కొనుగోలు చేశారు? అనే విషయాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల మేరకు సమాచారం. అయితే సీఐడీ కొత్తగా పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేది ఉత్కంఠగా మారింది.
సీబీఐ చేతికి స్కిల్ స్కామ్ కేసు?
కాగా, స్కిల్ స్కామ్ కేసులో మరిన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కేసు సీబీఐకి ఇచ్చేందుకు రంగం సిద్దమవుతోంది. ఈడీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఉండవల్లి వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సిబిఐ దర్యాప్తునకు అభ్యంతరం లేదని అడ్వకేట్ జనరల్ చెప్పారు.
ఈ నేపథ్యంలో కేసును సీబీఐకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతోంది. సీబీఐ దర్యాప్తు కోరుతూ నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానాలను ఏపీ సర్కార్ కోరే అవకాశం ఉంది.