గాజాపై భారీ స్థాయిలో భూతల క్షేత్రస్థాయి దాడికి ఇజ్రాయెల్ సైన్యం సర్వం సన్నద్ధం అయింది. ఓ వైపు గాజాస్ట్రిప్‌పై ఇజ్రాయెల్ భీకర వైమానిక శతఘ్నుల దాడులతో లక్షలాదిగా సామాన్య ప్రజలు దారుణ స్థితిలో అనుక్షణ సంకట పరిస్థితి ఎదుర్కొంటుండగా సరిహద్దులలో అత్యధిక సంఖ్యలో ఇజ్రాయెల్ సైన్యం మొహరించింది.
ఏ క్షణంలో అయినా బహుముఖ స్థాయి భూతల దాడులు జరుగుతాయని, పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెచ్చరికలు వెలువడ్డాయి. అయితే పౌరులు ఎటూ కదలకుండా హమాస్ బలగాలు నివారిస్తున్నాయి. ఈ దశలో ఇక తాము దాడికి అవసరం అయిన గ్రీన్‌లైట్ సంకేతానికి ఎదురుచూస్తున్నట్లు, తమ గ్రౌండ్ అటాక్ ఆరంభం కానుందని ఇజ్రాయెల్ సైనిక వర్గాలు ఆదివారం మధ్యాహ్నం సరిహద్దులలో తెలిపాయి.
హమాస్ మిలిటెంట్ల ఏరివేతనే లక్ష్యంగా కీలక స్థాయి యుద్ధం ఉంటుందని తెలిపిన ఇజ్రాయెల్ సైన్యం పౌరులకు మూడు గంటల సమయం ఇచ్చింది. గాజా ఉత్తర ప్రాంతంలో ముందుగా తమ గ్రౌండ్లెవెల్ దాడి ఆరంభం అవుతుందని, ప్రజలు వెంటనే దక్షిణ ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరికలు వెలువడ్డాయి.
ఏ క్షణంలో అయినా ఈ ప్రాంతం అత్యంత భీకర పోరుకు వేదిక కానుందని తెలిపారు. ఇప్పటికే పలు విధాలుగా హమాస్‌పై సమన్వయరీతిలో దాడికి సిద్ధం అయినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్ ) తెలిపింది. గాజా సరిహద్దులకు వచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సైనికులను ఉద్ధేశించి ప్రసంగించి వెళ్లారు.
శనివారం రాత్రి తాము జరిపిన వైమానిక దాడులలో హమాస్ సైనిక విభాగం అగ్రశ్రేణి దళం నుక్బా అగ్రనేత బిలాల్ అల్ ఖెద్రాను తాము హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. క్షేత్రస్థాయిలో ఇక ఏ వైపు నుంచి అయినా దాడులు జరుగుతాయనే హెచ్చరికలతో లక్షలాదిగా పాలస్తీనియన్లు ఉత్తర గాజా వీడుతున్నారు.
మధ్యలో వీరికి పలు ఆటంకాలు ఎదురవుతున్నాయి. కాగా ఇప్పటివరకు జరిగిన పరస్పర దాడులతో మొత్తం మృతుల సంఖ్య 3600 దాటింది. ఇప్పటికి మృతులు, గాయపడ్డ వారి సంఖ్య , నిర్వాసితుల వివరాలు పూర్తిగా నిర్థారణ కాలేదు. గాజాలోని దాదాపు 23 లక్షల మంది పౌరులలో అత్యధికులు ఇప్పుడు ఆహారం, తాగేందుకు నీరు, బాంబుల దాడి నుంచి తలదాచుకునేందుకు నీడ కోసం వెతుక్కుంటున్నారు.
ఇక ఆదివారం ఏ క్షణంలో అయినా ఇజ్రాయెల్ సేనలు గాజా ఉత్తర ప్రాంతాన్ని కైవసం చేసుకుంటాయనే వార్తలు వెలువడటంతో జనం పారిపోతున్నారు. అయితే ఈ క్రమంలో వారు తిండి , మంచినీరు కోసం వెతుక్కోవల్సి వస్తోంది. వేలాదిగా జనం ఇజ్రాయెల్ సేనల హెచ్చరికలతో కాజా ఆడేందుకు సిద్ధం అయ్యారు.