స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధంగా గుర్తించలేమని సుప్రీంకోర్టు మంగళవారం తెలియచేసింది. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధ అనుమతి కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇందుకు సంబంధించి తగిన చట్టాలను రూపొందించే బాధ్యతను పార్లమెంట్‌కే సుప్రీంకోర్టు వదిలిపెట్టింది.
లైంగిక ప్రత్యేకత ఆధారంగా సహజీవనం చేయడాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని కోర్టు స్పష్టం చేసింది. స్వలింగ సంపర్కులను సహజీవనం చేసే హక్కుపై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వివక్ష చూపలేవని కోర్టు పేర్కొంది. స్వలింగ సంపర్కులు ఉమ్మడిగా శిశువును దత్తత తీసుకోవచ్చని కూడా కోర్టు తెలిపింది.
ప్రస్తుత చట్టాల ప్రకారం ట్రాన్స్జెండర్లతోపాటు స్వలింగ సంపర్కులకు వివాహం చేసుకునే హక్కు ఉందని కోర్టు తెలిపింది. అటువంటి జంటలకు కల్పించే హక్కులను అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సొలిసిటర్ జనరల్ ఇదివరకే తెలిపారని సిజెఐ డివై చంద్రచూడ్ తన తీర్పులో వెల్లడించారు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్లపై నాలుగు వేర్వేరు తీర్పులు ఇచ్చింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్వలింగ సంపర్కం అనేది కేవలం పట్టణాలు లేదా సమాజంలో ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైనదనే అభిప్రాయాన్ని వీడాలని, లైంగిక ధోరణి ఆధారంగా వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని న్యాయస్థానం ఈ సందర్భంగా అభిప్రాయపడింది.
ఈ కేసులో మొత్తం నాలుగు తీర్పులను ఇవ్వనున్నట్లు దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ తెలిపారు. కోర్టులు చట్టాలను రూపొందించవని, కానీ, వాటిని అర్థం చేసుకుని అమలు చేస్తాయని సీజేఐ చెప్పారు. స్వలింగ సంపర్కుల కోసం ప్రత్యేక వివాహ చట్టాన్ని తీసుకురాకపోతే.. మనం మళ్లీ స్వాతంత్య్రానికి పూర్వపు స్థితికి వెళ్లినట్లేనని పేర్కొన్నారు.
అయితే, ప్రత్యేక వివాహ చట్టం అవసరమా లేదా అనేది పార్లమెంట్ నిర్ణయిస్తుందని, దీని చట్టపరిధిలోకి కోర్టు వెళ్లాలనుకోవట్లేదని చెప్పారు. ఇలాంటి బంధాలపై వివక్ష చూపకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించింది. వివాహేతర జంటలతో పాటు స్వలింగ సంపర్కులు బిడ్డలను దత్తత తీసుకోవచ్చని తెలిపారు.
భిన్న లింగాల జంటలే మంచి తల్లిదండ్రులుగా ఉంటారని చట్టం భావించట్లేదని చెప్పారు. ఇక సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ ఎస్కే కౌల్, రవీంద్ర భట్, హిమా కోహ్లీ, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు తీర్పును మే 11న రిజర్వ్ చేసింది. తీర్పును రిజర్వ్ చేసిన 5 నెలల తర్వాత నేడు తీర్పును వెలువరించింది.