‘వివిధ రంగాల్లో సమాజానికి సేవలు అందించిన వారికి వైఎస్సార్ అవార్డులు ఇస్తున్న ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది పురస్కార గ్రహీతల జాబితాను గురువారం ప్రకటించింది. రెండు స్వచ్ఛంధ సంస్థలతో సహా 23 మందికి జీవన సాఫల్య పురస్కారాలు, నలుగురికి సాఫల్య పురస్కారాలను ఇవ్వనున్నారు.
జీవన సాఫల్య పురస్కారం కింద రూ.10 లక్షలు, వైఎస్సార్ కాంస్య విగ్రహ, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందచేస్తారు. వైఎస్సార్ సాఫల్య పురస్కారం కింద రూ.5 లక్షల నగదుతో పాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందిస్తారని జివిడి కృష్ణమోహన్ పేర్కొన్నారు.
వరసగా మూడో ఏడాది వివిధ రంగాల నుండి లబ్ద ప్రతిష్ఠులైన వారిని ఎంపిక చేసి 2023 వైయస్సార్ లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డులు-ఎచీవ్మెంట్ అవార్డులను అందచేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాలనుంచి లబ్ధ ప్రతిష్ఠుల్ని ముఖ్యంగా సామాన్యుల్లో అసామాన్యులు, పలు రంగాల్లో సమాజానికి విశిష్ట సేవలందించి తమదైన ముద్ర వేసిన వారిని గుర్తించి అవార్డులను అందిస్తున్నట్టు పేర్కొన్నారు.
అవార్డుల ఎంపికకు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, జి.వి.డి.కృష్ణమోహన్, జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ లతోపాటు ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి ఆర్.ముత్యాల రాజు, సమాచారశాఖ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించిందని తెలిపారు.
అవార్డుల కోసం తమకు తాముగా దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు, సంస్థలను జిల్లాల్లో కలెక్టర్లు జిల్లా యంత్రాంగం ద్వారా ఎంపిక చేసిన నామినేషన్లను ఈకమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఎంపిక చేసినట్లు జివిడి చెప్పారు. ఈ ఏడాది 27 అవార్డుల్ని సిఫారసు చేసి, ముఖ్యమంత్రి ఆమోదం మేరకు కమిటీ ఈ ప్రకటన చేస్తున్నట్టు చెప్పారు. నవంబరు 1వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు అవార్డులు బహుకరించనున్నారు.