ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు గురువారం ఉత్తర గాజాలోకి అడుగుపెట్టాయి. హమాస్ స్థావరాలే లక్ష్యంగా భూతల దాడులు చేపట్టాయి. సుమారు 250 స్థావరాలే దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ దాడుల్లో కొందరు మిలిటెంట్లను హతమార్చి వారి మౌలిక సదుపాయాలను, యాంటీ-ట్యాంక్ మిస్సైల్ లాంచింగ్ పొజిషన్లను ధ్వంసం చేసినట్టు తెలిపింది.
తిరిగి యుద్ధట్యాంకులు వెనక్కి వచ్చేసినట్టు పేర్కొన్నది. మరోవైపు గాజా-లెబనాన్ సరిహద్దులో గురువారం వైమానిక, డ్రోన్ దాడులు చేసినట్టు పేర్కొన్నది. యుద్ధం కారణంగా మృతుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. మందుల కొరత వల్ల క్షతగాత్రుల ఇన్ఫెక్షన్ల రేటు పెరుగుతున్నదని గాజాలోని ఒక వైద్యుడు తెలిపారు.
ఇజ్రాయిల్ రక్షణ దళాలు 250 హమాస్ కేంద్రాలపై దాడి చేశాయి. ఓ మసీదు పక్కన ఉన్న మిస్సైల్ లాంచర్‌ను కూడా ఐడీఎఫ్ దళాలు టార్గెట్ చేశాయి. వైమానిక దళానికి చెందిన జెట్ ఫైటర్లు గాజా స్ట్రిప్‌లో ఉన్న హమాస్ టెర్రర్ గ్రూపుకు చెందిన సుమారు 250 కేంద్రాలను పేల్చివేసినట్లు ఇజ్రాయిల్ రక్షణ దళాలు పేర్కొన్నాయి.
హమాస్ కమాండ్ సెంటర్లు, టన్నెళ్లు, రాకెట్ లాంచర్లను ధ్వంసం చేశారు. పౌరులు నివసించే ప్రదేశాల నుంచి రాకెట్ లాంచర్లతో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ వైపు అటాక్ చేశారని, ఆ లాంచర్లను పేల్చివేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఖాన్ యూనిస్‌లో ఉన్న హమాస్‌కు చెందిన సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ లాంఛర్‌ను నౌకాదళం పేల్చినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.
రాకెట్ లాంఛర్ ఓ మసీదు, పిల్లలు స్కూల్ సమీపంలో ఉందని, అంటే పౌరులు నివసించే కేంద్రాలను హమాస్ ఉగ్రవాదులు వాడుకుంటున్నారని స్పష్టమవుతోందని ఐడీఎఫ్ తెలిపింది. గాజాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న వైమానిక దాడుల్లో పాత్రికేయులు కూడా పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 25 మంది పైగా పాత్రికేయులు చనిపోయినట్లు తెలుస్తోంది.
తాజాగా బుధవారం రాత్రి జరిగిన ఇజ్రాయిల్ దాడుల్లో ఆల్ జజీరా జర్నలిస్టు, అరబిక్ బ్యూరో ఛీఫ్ వేల్ అల్ దహదౌ కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ గాజాలోని ఇజ్రాయెల్ సురక్షిత ప్రాంతాల్లో ఒకటిగా భావిస్తున్న నుసెరాత్ క్యాంప్ అతని ఇంటిని లక్ష్యంగా జరిగిన దాడిలో భార్య, కుమార్తె, కుమారుడిని కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
కాగా, ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడికి ఇండియా- మధ్య ప్రాచ్యం-యూరప్ ఆర్థిక కారిడార్ ఒక కారణమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌తో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే తన అభిప్రాయానికి ఆధారాలు లేవని, ఇజ్రాయెల్ అనుసంధానత, ప్రాంతీయ అనుసంధానం కోసం తాము చేస్తున్న ప్రయత్నాల వల్ల ఈ దాడులు జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు.