గత నాలుగేళ్లుగా, 2017-21 మధ్య ప్రతి ఏడాది లక్ష మందికి పైగా యువత ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమాల పట్ల ఆసక్తి చోపుతున్నారని అంటూ, చాలామంది తమ వెబ్ సైట్ ద్వారా కూడా చేరుతున్నారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) సహ సర్ కార్యవాహ డా. మన్మోహన్ వైద్య వెల్లడించారు. వారి సంఖ్య ఏడాదికి 1 లక్ష నుండి 1.25 లక్షల వరకు ఉంటుందని చెప్పారు.
సంఘ్ నేడు ప్రపంచంలో నే యువత అత్యధికంగా ఉన్న సంస్థ అని చెబుతూ ప్రస్తుత దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ జరుగుతున్న 55 వేల సంఘ్ శాఖలలో హాజరవుతున్న వారిలో 60 శాతం మంది వరకు విద్యార్థులే ఉంటున్నారని తెలిపారు. మిగిలిన వారు ఉద్యోగులు, ఇతరులని చెప్పారు. ఇటీవల కాలంలో యువతలో సంఘ్ పట్ల ఆసక్తి గణనీయంగా పెరుగుతున్నట్లు చెప్పారు.
హైదరాబాద్ లో ఈ నెల 5 నుండి మూడు రోజులపాటు జరిగిన సంఘ్ ప్రేరణతో వివిధ రంగాల్లో పనిచేస్తున్న సంస్థల పదాధికారుల సమన్వయ సమావేశాల ముగింపు సందర్భంగా సమావేశం వివరాలను ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తో కలసి సమావేశంలో తెలిపారు.
కరోనా మూలంగా సంఘ్ దైనందిక శాఖ కార్యక్రమాలు తాత్కాలికంగా ఆగినప్పటికీ, తిరిగి పూర్తి స్థాయిలో పుంజుకొన్నట్లు ఆయన తెలిపారు. గత ఏడాది ఆరోగ్య రంగానికి సంబంధించి పోషకాహార లోపాన్ని అధిగమించటానికి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశామని ఆయన పేర్కొన్నారు.
అదే విధంగా, ఆర్థిక రంగంలో ఉపాధి కల్పన పై కొన్ని సంస్థలు దృష్టి పెట్టాయని, భారత్ కేంద్రిత విద్యా విధానం పై చర్చ జరిగిందని తెలిపారు. సంఘ్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా సేవా సంస్థలు ఆరు వేల బ్లాక్ (మండల్) లలో 10 లక్షల మందికి పైగా కార్యకర్తలకు కరోనాను ఎదుర్కొనే క్రమంలో శిక్షణ ఇచ్చినట్లు వివరించారు.
సంఘ్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా సేవా సంస్థలు ఆరు వేల బ్లాక్ (మండల్) లలో 10 లక్షల మందికి పైగా కార్యకర్తలకు కరోనాను ఎదుర్కొనే క్రమంలో శిక్షణ ఇచ్చినట్లు డా. వైద్య పేర్కొన్నారు.
సర్ సంఘ్ చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళె లతో పాటు అయిదుగురు సహ సర్ కార్యవాహ లు పాల్గొన్న ఈ సమావేశాలలో 36 సంస్థలకు చెందిన 216 మంది పాల్గొన్నారు. ఈ సమావేశాలు ప్రతీ సంవత్సరం సెప్టెంబర్, జనవరి నెలల్లో జరుగుతాయని ఆయన చెప్పారు.
వివిధ రంగాల్లో పనిచేస్తున్న స్వయంసేవక్ లు తమ అనుభవాలను, భవిష్య కార్యక్రమాలను ఇతరులతో పంచుకోవటం మాత్రమే జరుగుతుందని ఆయన తెలిపారు.అయితే ఈ సమావేశాలలో ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోరని డా. వైద్య స్పష్టం చేశారు.
వివిధ సంస్థలు తమకు సంబంధించిన రంగాల గురించి అధ్యయనం చేసి, ప్రభుత్వానికి సూచనలు సలహాలు అందిస్తాయని ఆయన చెప్పారు. వాటిని పరిగణనలోకి తీసుకోవటం ప్రభుత్వం పరిధిలోని అంశం అని డా. వైద్య స్పష్టం చేశారు.
స్వాతంత్రానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరుగున పడిన 250 మంది స్వాతంత్ర సమరయోధుల చరిత్రను తాము వెలికి తీయటం జరిగిందని, ఇందులో సమాజంలోని వివిధ వర్గాలతోపాటు ఎస్సీ ఎస్టీలవారు ఉన్నారని ఆయన చెప్పారు. వీటిని సంస్కార భారతి నాటకాల రూపంలో ప్రచారం చేయనున్నదని తెలిపారు.
సమాజ జాగరణ అనేది సంఘ్ ప్రధాన కార్యమని, జాగృత సమాజం ప్రభుత్వ విధానాలను ప్రభావం చూపుతుందని ఆయన చెప్పారు. సమాజ సంఘటన ద్వారా పరివర్తన కోసం స్వయంసేవక్ లు కృషి చేస్తారని డా. వైద్య వివరించారు.
వైవిధ్యం అంటే విభేదాలు కావని, జాతి ఏకతకు అంతః సూత్రమైన అంశాలకు అనుగుణంగా ఈ విధానం ఉండాలని ఆయన సూచించారు. కుల వివక్షను రూపుమాపి, సమాజంలో సద్భావనను పెంపొందించటానికి సామాజిక సమరసత సంస్థ కృషి చేస్తున్నామని వివరించారు.
జాతీయ విద్యా విధానం భారతీయ చరిత్ర ఆధ్యాత్మికతను ప్రతిబింబించేట్లు ఉండాలని, ఒకే విద్యా విధానం అనేది రాష్ట్రాల భిన్నత్వానికి ఏమాత్రం ఆటంకం కాదని ఆయన వివరించారు.