తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపుతోంది. అలిపిరి కాలినడక మార్గంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం సమీపంలో చిరుత, ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాలో రికార్డు కావడంతో అధికారులు ఒక్క సారిగా అప్రమత్తమయ్యారు.దీంతో శ్రీవారి దర్శనానికి నడక దారిలో వెళ్లే భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది.
గత నెల 20న బోనులో చిక్కుకున్న ఆరో చిరుత తర్వాత నెల వ్యవధిలో చిరుతల సంచారం లేకపోవడంతో భక్తులు, అధికారులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. పైగా చిరుతల సంచారం లేకపోవడం వలన టీటీడీ, అటవీశాఖ అధికారులు కూడా ఆంక్షలను సడలిస్తూ వచ్చారు.
ఈ నేపథ్యంలో మరోసారి తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపడంతో టీటీడీ అధికారులు అప్రమత్తయ్యారు. అలిపిరి నడక మార్గంలో ఈ నెల 24 నుంచి 27వ తేది మధ్యలో లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం నుంచి రిపీటర్ మధ్య చిరుతు, ఎలుగు బంటి తిరుగున్నట్లు గుర్తించారు.
చిరుతతో పాటు ఎలుగుబంటి కూడా సంచరిస్తుండటంతో నడక దారిలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని, కాలినడకన వెళ్లే సమయంలో భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని కోరింది. మరో వైపు చిరుతను, ఎలుగుబంటిని బంధించేందుకు టీటీడీ, అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
ఇటీవల చిన్నారి పై చిరుత దాడి చేసి చంపిన తర్వాత టీటీడీ, అటవీశాఖలు సంయుక్తంగా పలు చర్యలు తీసుకున్నాయి. ఒక వైపు భక్తుల భద్రతపై దృష్టి సారిస్తూనే, మరో వైపు చిరుతలను పట్టుకునేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందుకు గాను ప్రత్యేక బోన్లను ఏర్పాటు చేసి ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు.
అటవీశాఖ అధికారులు వన్య ప్రాణులు, కూృరమృగాల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వచ్చారు. కాలినడక మార్గంలో చిరుతల నుంచి భక్తులకు రక్షణ కల్పించేందుకు అధికారులు బోనులను ఏర్పాటు చేసి ఆరు చిరుతలను బంధించిన విషయం తెలిసిందే.
అయితే, నెల రోజులుగా చిరుతల సంచారం లేకపోవడంతో అటవీ ప్రాంతంలో చిరుతలు ఇక లేవని అందరూ భావించారు. కానీ మరో సారి చిరుత సంచారం కనిపించడంతో భక్తుల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా, ప్రకాశం జిల్లా అర్థవీడు మండలంలో పెద్దపులి సంచారంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
గత కొద్ది రోజులుగా అర్థవీడు మండలంలోని లక్ష్మీపురం, బోల్లిపల్లి గ్రామాల పరిసర ప్రాంతాల్లో పెద్దపులి తిరుగుతూ ఉండడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. లక్ష్మీపురం గ్రామ మీపంలో మేతకు వెళ్లిన ఓ గేదె పై పెద్దపులి దాడి చేసి చంపి తినేసింది.
అంతే కాదు బొల్లిపల్లి గ్రామ సమీపంలో సైతం ఆవు పై దాడి చేసి హతమార్చింది. ఈ విషయాన్ని గుర్తించిన అటవీశాఖ అధికారులు పెద్ద పులి జాడలకు అనుగుణంగా దాని సంచారాన్ని పసిగట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అటవీ ప్రాంతంలో కెమెరాలను ఏర్పాటు చేసి పెద్ద పులి సంచారాన్నిగుర్తించే పనిలో అటవీశాఖ అధికారులు నిమగ్నమయ్యారు.