తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టిడిపి నిర్ణయించుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో టీటీడీ రాష్త్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ శనివారం ములాఖత్ అయినా సందర్భంగా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణపై దృష్టి పెట్టలేమని చంద్రబాబు కాసానితో తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. గత 50 రోజులుగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై కోర్టుల్లో విచారణ జరుగుతున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో ఏపీ రాజకీయాలపైనే దృష్టి పెట్టాలని టీడీపీ నిర్ణయించుకుంది.
తెలంగాణలో పోటీకి దూరంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయించారు. తెలంగాణలో టీడీపీకి ఎంతో కొంత క్యాడర్ ఉన్నప్పటిక వారిని నడిపించేందుకు బలమైన నేతలు కరువయ్యారు. తెలంగాణ విభజన తర్వాత టీడీపీ సీనియర్ నేతలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో చేరారు.
ఈ దశలో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో అధిష్టానం ఉందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. తీరా ఎన్నికలు దగ్గరకు వచ్చిన క్రమంలో చంద్రబాబు అరెస్టు, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులతో ఎన్నికలకు దూరంగా ఉండాలని టీటీడీపీ నిర్ణయించుకుంది.
ఏపీలో గెలిస్తే తెలంగాణలో కూడా పార్టీ బలం పుంజుకుంటుందని చంద్రబాబు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఏదో మొక్కుబడిగా పోటీ చేసి సరైన ఫలితం రాలేదని బాధపడే బదులు ఎన్నికలకు దూరంగా ఉండటమే మంచిదన్నారని కాసాని తెలిపారు. ఈ విషయాలపై ఒకసారి ఆలోచన చేయాలని, అవసరమైతే మరోసారి చర్చిద్దామని చంద్రబాబు అన్నారని కాసాని తెలిపారు.