సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరిగింది. చెప్పాలా గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు కత్తితో దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ఎంపీ ప్రభాకర్ రెడ్డికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.
నిందితుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎంపీ ప్రభాకర్ రెడ్డికి మెరుగైన వైద్యం కోసం గజ్వేల్ ఆసుపత్రి నుంచి అంబులెన్స్ లో సికింద్రాబాద్ యశోద కు తరలిస్తున్నారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్ వెంటనే హైదరాబాద్ కు బయల్దేరారు. ఫోన్ లో ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యంపై ఆరా తీశారు.
ఈ ఘటనకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు దాడి చేసిన వ్యక్తిపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగటంతో గాయపడ్డాడు.ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్న ప్రభాకర్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
ఇప్పటికే బీఫామ్ అందుకున్న ఆయన కొద్దిరోజులుగా నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై కత్తితో దాడి జరగటం సంచలన పరిణామంగా మారింది. కత్తితో దాడి చేసిన వ్యక్తి రాజు అని, చెప్యాలకు చెందినవాడిగి గుర్తించినట్లు
సిద్ధిపేట సీపీ శ్వేతారెడ్డి చెప్పారు. దాడి చేసిన టైంలో రాజు మద్యం మత్తులో ఉన్నాడని తెలిపారు. ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజా తీర్పు ను ఎదుర్కోలేక భౌతిక దాడులు,హత్యా రాజకీయాలకు తెగబడడం సిగ్గుచేటని సీఎం మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో ఇటువంటి సంఘ విద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు, బీఆర్ఎస్ నేతలకు కార్యకర్తలకు బిఆర్ఎస్ అధినేత పిలుపునిచ్చారు. బిఆర్ఎస్ నాయకులపై, కార్యకర్తలపై ఎవరు దాడులకు పాల్పడ్డా సహించేది లేదని సీఎం హెచ్చరించారు.
కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి ఘటనపై గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రభాకర్ రెడ్డి త్వరగా కొలుకోవాలని కోరారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. “ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య ప్రక్రియకే ప్రమాదకరం. ఎన్నికల సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థులు, ప్రచారం చేసే వారి భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలి” అని గవర్నర్ పేర్కొన్నారు.