ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడిపై మరో కేసు నమోదైంది. ప్రస్తుతం స్కిల్ స్కాం కేసులో అరెస్టై గత 48రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుపై సీఐడీ అధికారులు మరో కేసు నమోదు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారనే అరోపణల నేపథ్యంలో సీఐడీ ఈ కేసు నమోదు చేసినట్లుగా వెల్లడించింది.
పిసి యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈకేసులో నారా చంద్రబాబునాయుడుని ఎ3గా చేర్చారు సిఐడి అధికారులు. చంద్రబాబు కేసు నమోదు చేసిన అంశాన్ని ఏసీబీ కోర్టుకు తెలిపారు సిఐడి అధికారులు. ఏసిబి కోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ జరపాలని సిఐడి అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపేందుకు పిటిషన్ను అనుమతించింది ఏసీబీ కోర్టు.
స్కిల్ స్కాం కేసులో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబుపై ఇప్పటికే ఇన్రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ వంటి కేసుల్లో కూడా ఆయన పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. అయితే గత 50 రోజులకు పైగా జైలులో ఉండటం కారణంగా ఆయన ఆరోగ్యం బాగోలేదని, కంటి ఆపరేషన్ చేయాలని బెయిల్ కోసం చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రయత్నిస్తున్న సమయంలో సీఐడీ కొత్త కేసు నమోదు చేయడం, దాన్ని ఏసీబీ కోర్టులో విచారణ జరిపించాలని కోరడం టీడీపీ శ్రేణులకు షాక్ వచ్చినట్లైంది.