తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి ఆ కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. పార్టీకి, అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని అధిష్టానం నిర్ణయించినందు వల్లే రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
తన రాజీనామా లేఖను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపించినట్లు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు.
త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాసాని సుముఖంగా ఉండగా.. టీడీపీ అగ్ర నాయకత్వం మాత్రం అందుకు అంగీకరించకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి కాసాని రాజీనామా చేశారు.
ముందు ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించి, అభ్యర్థుల జాబితా కూడా సిద్ధం చేసిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయకూడదని అధిష్టానం నిర్ణయించడం కాసానికి తీవ్ర నిరాశకు గురిచేసింది. మరోవైపు, తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా అగ్ర నాయకత్వం నిర్ణయంపై అసంతృప్తి గుర్రుగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు పార్టీలో ఉండి ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు.
ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయల్లేదని తాను పార్టీ కార్యకర్తలకు చెప్పలేనని, అందుకే రాజీనామా చేశాననీ కాసాని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ విషయమై మాట్లాడటానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు 20 సార్లు ఫోన్ చేసినా సమాధానం లేదని కాసాని అసహనం వ్యక్తం చేశారు.
మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థులు సొంత డబ్బులు పెట్టుకుని వాళ్ళే నిలబడాలని నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఇంత జరుగుతుంటే అధినేత చంద్రబాబు మాత్రం ఈ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయడం లేదని చెప్పారని, తనను ఎందుకు పార్టీలోకి పిలిచినట్లు, ఇప్పుడు ఎందుకు ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటన చేయడం లేదని చంద్రబాబును అడిగానని వెల్లడించారు.
ఎన్నికల్లో పోటీ చేయాలని అధిష్టానానికి చెప్పినా వినకపోవడంతో కాసాని చివరకు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. కాగా, ఇప్పటికే అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌కు ఆహ్వానాలు అందినట్లు సమాచారం. తనకు సముచితన స్థానం కల్పించే పార్టీలోకే వెళ్లే ఆలోచనలో కాసాని ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరలో ఉన్న నేపథ్యంలో ఏ పార్టీలో చేరే విషయంపై ఆయన త్వరలోనే నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. కాగా, తాను పోటీ చేస్తే కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు.