తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలై, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నేతలు, ప్రజాప్రతినిధులు కోడ్‌కు లోబడి వ్యవహిరించాలి. కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. తాజాగా మంత్రి కేటీఆర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు అందాయి.
ప్రగతి భవన్ వేదికగా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు జరిగినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్‌రాస్ లకు ఫిర్యాదులు అందాయి. దీంతో రిటర్నింగ్ అధికారిని, ప్రవర్తన నియమావళి బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లను పంపించి విచారణ జరిపినట్లు రొనాల్డ్ రాస్ వెల్లడించారు.
కోడ్ ఉల్లంఘనలపై మంత్రి కేటీఆర్ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. పూర్తి విచారణ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ బంగ్లాలు, అతిథి గృహాల నుంచి ఎన్నికల ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం చెప్పిందని ఎన్నికల అధికారి గుర్తుచేశారు.
మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన ప్రెస్‌మీట్ పెట్టగా సీఎం కేసీఆర్‌పైనా ఫిర్యాదులు వచ్చాయా ? అని మీడియా అడిన ప్రశ్నకు ఆ విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రగతిభవన్‌లో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని వేర్వేరు పార్టీల నుంచి ఫిర్యాదులు అందాయని, వాటిపై విచారణ జరుపుతున్నామని వివరించారు.
కాగా, ప్రగతి భవన్ వేదికగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫారాలు అందజేయటంపై గతంలోనే ఎన్నికల సంఘానికి ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. నిబంధనలకు విరుద్ధంగా సీఎం అధికారిక నివాసంలో పార్టీ కార్యకలాపాలు చేపడుతూ అభ్యర్తులకు బీఫారుల అందజేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారులు ప్రగతి భవన్ నిర్వహణ అధికారులకు నోటీసులు జారీ చేశాయి.