ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యుడు రాఘవ ఛద్దా సస్పెన్షన్ వ్యవహారంపై ఆయన వెంటనే రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ను కలిసి, సభలో తన ప్రవర్తనపై క్షమాపణలు తెలియచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీ బిల్లుకు సంబంధించి ఈ ఆప్ ఎంపి సభలో అనుచితంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి.
వివాదాస్పద ఢిల్లీ సర్వీసుల బిల్లును అధ్యయనం చేసేందుకు ఒక సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరేందుకు రూపొందించిన తీర్మానంపై తమ అనుమతి లేకుండానే తమ పేర్లను రాఘవ్ చద్దా చేర్చారని అధికార బిజెపికి చెందిన ఎంపీలతో సహా పలువురు ఎంపీలు ఫిర్యాదు చేయడంతో ఆగస్టు 11వ తేదీన ఛద్దాను రాజ్యసభ చైర్మన్ సస్పెండ్ చేసి ఈ అంశాన్ని సభా హక్కుల కమిటీకి నివేదించారు.
సంబంధిత విషయంపై తనకు సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఆదేశాలను ఈ బహిష్కృత ఎంపి తమ సామాజిక మాధ్యమంలో తెలిపారు. తాను వెంటనే రాజ్యసభ ఛైర్మన్‌ను కలుసుకునేందుకు అనుమతి కోరినట్లు వివరించారు. ఎంపి వెలువరించే క్షమాపణను రాజ్యసభ ఛైర్మన్ సానుభూతితో ఆమోదించాలని, ఈ వివాదానికి ముగింపు పలుకాలని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం స్పందించింది.
రాఘవ తొలిసారి ఎంపి అని, సభలో అందరి కన్నా చిన్నవాడని , ఆయనకు సానుకూల రీతిలో అవకాశం ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. కాగా ఇప్పటి పరిణామంపై అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి మాట్లాడుతూ ఈ ఉదంతానికి సంబంధించి పార్లమెంట్ హక్కుల కమిటీ సమావేశం అవుతోందని, ఎటువంటి తదుపరి చర్యలు ఉంటాయనేది స్పష్టం అవుతుందని తెలిపారు.
కాగా అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను దీపావళి తరువాతి తేదీకి వాయిదా వేసింది. కేసుపై తమకు పూర్తి వివరాలు అందించాలని అటార్నీ జనరల్‌ను ఆదేశించారు.