ఇసుక కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో బుధవారం జరిగిన విచారణలో ఈ నెల 28 వరకు చంద్రబాబును అరెస్ట్ చేయబోమని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఉచిత ఇసుక విధానం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందన్న ఆరోపణలతో ఏపీ సీఐడీ చంద్రబాబుపై కేసు నమోదు చేసింది.
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇసుక కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు లాయర్లు వాదనలు వినిపించారు. చంద్రబాబు పిటిషన్ పై బుధవారం హైకోర్టులో విచారణ జరగగా, చంద్రబాబును ఈ నెల 28 వరకు అరెస్ట్ చేయబోమని సీఐడీ కోర్టుకు తెలిపింది.
సీఐడీ న్యాయవాదుల స్టేట్మెంట్ను హైకోర్టు రికార్డు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది. అనారోగ్య కారణాల రీత్యా చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉచిత ఇసుక విధానం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ సీఐడీ చంద్రబాబుపై కేసు నమోదు చేసింది.
ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు నవంబర్ 22కి వాయిదా వేసింది. అదే విధంగా కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. అయితే చంద్రబాబు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని, న్యాయవిచారణ ప్రక్రియలో మునిగిపోయేలా చేయాలనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం ఈ కేసు పెట్టి వేధిస్తున్నారని పిటిషన్లో తెలిపారు.
వైసీపీ పాలనలో ఇసుక అక్రమాలపై చంద్రబాబు, ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారని, అందుకే కేసులు పెట్టి వేధిస్తున్నారని వాదనలు వినిపించారు. ప్రభుత్వ అక్రమాలపై ప్రశ్నిస్తే ఆ అంశాలను ముడిపెట్టి చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేశారని చంద్రబాబు పిటిషన్లో పేర్కొన్నారు.
కాగా, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేయడంతో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు.
చంద్రబాబుకు ఇప్పటికే అనారోగ్య కారణాలతో బెయిల్‌పై ఉన్నందున విచారణ వాయిదా వేయాలని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుకు నవంబర్ 28 వరకు బెయిల్ గడువు ఉన్నందున విచారణను 22వ తేదీకి వాయిదా వేశారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఏసీబీ కోర్టు విచారణ దశలో ఉన్న పీటీ వారెంట్‌పై నవంబర్ 7 వరకు హైకోర్టు స్టే విధించింది.