గత వారం రోజులుగా తీవ్ర వాయు కాలుష్యంతో సతమతమవుతోన్న ఢిల్లీ ప్రజలకు ఉపశమనం కలిగించేలా నవంబరు 20, 21 తేదీల్లో మేఘ మథనం ద్వారా కృత్రిమ వర్షం కురిపించేందుకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుంది. పొరుగు రాష్ట్రాల్లో పంట అవశేషాలు దగ్ధం, వాహన ఉద్గారాలు వంటి స్థానిక అంశాల కలయిక కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక వరుసగా ఏడు రోజుల నుంచి తీవ్ర కేటగిరీలో కొనసాగుతోంది. ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్, ఆర్థిక మంత్రి అతిషి ఐఐటీ కాన్పూర్ బృందంతో సమావేశమయ్యారు.
అత్యవసర వాయు కాలుష్య తీవ్రత మధ్య కృత్రిమ వర్షం కురిపించవచ్చని ప్రతిపాదించారు. ఢిల్లీలో పలు కారణాలతో ఇప్పుడు దట్టమైన పొగమంచుతో వాయుకాలుష్య తీవ్రత ప్రమాదకర స్థితికి చేరుకుంది. వెంటనే ఈ విపరీత పరిణామం నుంచి ప్రజలను కాపాడేందుకు ఢిల్లీ ప్రభుత్వం రంగంలోకి దిగింది.
గాలిలో సరైన తేమను సాంద్రతను పెంచేందుకు ఇప్పుడు వర్షాలు పడాల్సి ఉంది. దీనిని గుర్తించి కృత్రిమ వర్షాలు కురిపించేందుకు రంగం సిద్ధం అయింది. ఈ నెల 20 లేదా 21 వ తేదీలలో దట్టంగా మబ్బులు ఉంటే , వర్షాలు కురిపించేందుకు శాస్త్రీయ మార్గాలలో ప్రయోగాలు జరుగుతాయి. దీని గురించి ఐఐటి కాన్పూర్ నిపుణుల బృందంతో చర్చించినట్లు ఆ తరువాత మంత్రి విలేకరులకు తెలిపారు.
కాలుష్య నివారణకు కృత్రిమ వర్షాలు ఓ మార్గమని ఐఐటి కాన్పూర్ నుంచి ఢిల్లీ ప్రభుత్వానికి ఓ సూచన అందింది. దీనిపై తాము విశ్లేషించినట్లు, గురువారం తమకు దీని కార్యాచరణ ప్రతిపాదనలు అందుతాయని మంత్రి తెలిపారు. దీనిని తరువాత సుప్రీంకోర్టు ముందుకు పంపిస్తామని , తరువాత ఈ ప్రయోగం జరిపేందుకు వీలుంటుందని మంత్రి వివరించారు.
ఈ నేపథ్యంలో వివరణాత్మక ప్రణాళిక సమర్పించాలని ఐఐటీ బృందాన్ని ఢిల్లీ ప్రభుత్వం కోరింది. ఈ ప్రణాళికను శుక్రవారం సుప్రీంకోర్టులో సమర్పించనున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. దీనికి సర్వోన్నత న్యాయస్థానం ఆమోదముద్ర వేస్తే ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం ఈ పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాయి.
‘కృత్రిమ వర్షం కురిపించాలంటే కనీసం 40 శాతం మేఘాల ఆవరణం అవసరమని ఐఐటీ బృందం తెలిపింది. నవంబర్ 20-21 తేదీల్లో మేఘాలు కమ్ముకునే అవకాశం ఉందని.. ఈ ప్లాన్ను అమలు చేసేందుకు అనుమతి లభిస్తే మేము ప్రయోగాత్మక అధ్యయనాన్ని నిర్వహించగలం’ అని ఓ అధికారి చెప్పారు.