ఇజ్రాయేల్ – హమాస్ దాడులతో గాజాలో మృత్యు ఘోష కొనసాగుతోంంది. ఇజ్రాయేల్ దాడుల కారణంగా ఓ ఆస్పత్రికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ముగ్గురు పసికందులు మృతి చెందారు. శనివారం అల్ షిఫా హాస్పిటల్‌లోని చిన్న పిల్లల సంరక్షణ యూనిట్ కు కరెంట్ కట్ అయింది.
దాంతో, అప్రమత్తమైన డాక్లర్లు కృత్రిమ పద్ధతుల్లో పసికందులకు ఊపిరి అందించేందుకు ప్రయత్నించినా, ముగ్గురు చిన్నారులు ప్రాణాలు వదిలారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాదు అక్కడ చికిత్స పొందుతున్న 39 మంది పిల్లలు మృత్యువుతో పోరాడుతున్నారని వెల్లడించింది.
ఇజ్రాయేల్ దళాలు అల్ షిఫా హాస్పిటల్ లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. దాంతో, ఆస్పత్రిలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ పునరుద్దరణ చేద్దామంటే జనరేటర్‌కు ఇంధనం అందుబాటులో లేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన డాక్టర్ అష్రఫ్ అల్ ఖిద్రా పేర్కొన్నాడు. ఈ ఆస్పత్రిలో దాదాపు 4 వేల మంది చికిత్స పొందుతున్నారు.
అంతేకాదు ఇజరాయేల్ – హమాస్ దళాల దాడుల కారణంగా సర్వం కోల్పోయిన 20 వేల మంది హాస్పిటల్ కాంప్లెక్స్‌లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే హమాస్ దళాలు ఆస్పత్రి కేంద్రంగా మిలిటరీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని ఇజ్రాయేల్ ఆరోపిస్తోంది. కానీ, హమాస్ మాత్రం తాము వాటిని కొట్టిపారేసింది.
నిజ నిర్ధారణ కోసం షిఫా ఆస్పత్రికి ప్రత్యేక దళలాలను పంపి, విచారణ జరిపించాలని ఐక్యరాజ్య సమితి, రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్ కమిటీలను హమాస్ కోరింది. కాగా, ఆసుపత్రి నుండి బాలలను వేరేచోటకు తరలించేందుకు ఇజ్రాయిల్ దళాలు అంగీకారం తెలిపాయి.
మరోవంక, గాజాపై చేస్తున్న దాడులను ఆపేయాలని ఇజ్రాయిల్‌ను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యువల్ మాక్రన్ కోరారు. పిల్లలు, మహిళల్ని చంపేస్తున్నారని, ఆ మారణహోమాన్ని నిలిపివేయాలని కోరారు. అర్థం లేని రీతిలో బాంబు దాడుల్ని కొనసాగిస్తున్నారని, ఆ బాంబు దాడుల్ని ఆపాలని కోరుతున్నట్లు మాక్రన్ తెలిపారు.
హమాస్ చేపట్టిన ఉగ్రవాద చర్యలను ఫ్రాన్స్ ఖండిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మాక్రన్ చేసిన సూచనను ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యూ తోసిపుచ్చారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారమే తాము మిలిటరీ కేంద్రాలను టార్గెట్ చేస్తున్నట్లు తెలిపారు. అటాక్ చేయడానికి ముందు వార్నింగ్ ఇస్తున్నామని, పౌరుల మరణాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.