నామినేషన్ల దాఖలు ఘట్టం పూర్తి కావడంతో అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రచారంపై దృష్టి సారిస్తున్న సమయంలో పలు రాజకీయ ప్రకటనలను నిలిపివేస్తూ తెలంగాణాలో ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని ఛానళ్లు, సోషల్ మీడియా ఛానళ్లకు తెలంగాణ చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ లేఖలు రాశారు.
అసెంబ్లీ సాధారణ ఎన్నికల కోసం స్టేట్ లెవెల్ సర్టిఫికేషన్ కమిటీ ఆమోదించిన రాజకీయ ప్రకటనలు దుర్వినియోగం అవుతున్నాయని సీఈవో వెల్లడించారు. రాజకీయ పార్టీలు ప్రచారంలో భాగంగా పత్రికలు, టీవీ ఛానెళ్ళలో ముద్రించే, ప్రసారం చేసే యాడ్లను తొలుత స్టేట్ లెవల్ సర్టిఫికేషన్ కమిటీకి స్క్రూటినీ నిమిత్తం పంపుతాయి.
వాటిని పరిశీలించిన తర్వాతే ప్రకటనలు అనుమతి పొందుతాయని, కానీ అలా అనుమతి పొందిన తర్వాత వాటికి ఇష్టానుసారం మార్పులు చేర్పులు చేసి ప్రసారం చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని సీఈవో కార్యాలయం స్పష్టం చేసింది. ఇష్టానుసారంగా మార్చి ప్రసారం చేస్తూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘిస్తున్న కారణంగా ఆ ప్రకటనలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం తెలిపింది.
సీఈఓ ఆఫీస్ రద్దు చేసిన 15 యాడ్లలో కాంగ్రెస్‌కు చెందినవి 9, బీజేపీకి చెందినవి 5, బీఆర్ఎస్ పార్టీకి చెందినది ఒకటి చొప్పున ఉన్నాయి. వాటి అనుమతుల్ని రద్దు చేసి ప్రసారం కాకుండా నిషేధం విధించడంతో అవి ఇకపై టీవీ ఛానెళ్ళలో, సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో డిస్ప్లే అయ్యే అవకాశంలేదు. ఈమేరకు మీడియా సంస్థలకు సీఈవో లేఖ రాశారు. ఆ ప్రకటనల ప్రసారాలను వెంటనే నిలిపివేయాలని ఛానళ్లకు సూచించారు.