తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో మొత్తం 4,810 నామినేషన్లు దాఖలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ స్థానంలో అత్యధికంగా 145 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ నియోజకవర్గంలో అత్యధిక నామినేషన్లు దాఖలయ్యాయి.
అతి తక్కువగా భద్రాచలం నియోజకవర్గంలో నామినేషన్లు వేశారు. నామినేషన్ల దాఖలుకు తుది గడువైన శుక్రవారం ఒక్కరోజే మొత్తం 2,327 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 13వ తేదీ నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అసంపూర్తిగా నామినేషన్ పత్రాలు నింపితే, అలాంటి అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరిస్తారు.
అదే రోజు నామినేషన్ల తుది జాబితా విడుదల అవుతుంది. 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఆ తర్వాత అసలు బరిలో ఉండే మొత్తం అభ్యర్థుల సంఖ్య ఖరారవుతుంది. 30వ తేదీ పోలింగ్, డిసెంబర్ 3వ తేదీ ఫలితాలు వెల్లడయ్యే విషయం తెలిసిందే.
ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకున్న పత్రికా ప్రకటనలు, వీడియోలు కాకుండా, వాటిని మార్చివేసి ప్రసారం చేస్తున్న 15 రాజకీయ ప్రకటనల్ని నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో రూ.544.27 కోట్ల విలువైన సొత్తు పట్టుబడింది. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 11వ తేదీ ఉదయం వరకు నిర్వహించిన తనిఖీల్లో నగదుతోపాటు బంగారం, వెండి, ఇతర ఆభరణాలు, చీరలు, క్రీడా సామాగ్రి, కుక్కర్లు, బియ్యం వంటి వాటిని ఎన్నికల తనిఖీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.