నాంపల్లిలోని బజారఘాట్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ అపార్టుమెంటు గ్రౌండ్ ఫ్లోర్లో చెలరేగిన మంటలు ఒక్కసారిగా నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో తొమ్మిదిమంది సజీవ దహనమయ్యారు. మంటల్లో మరికొంత మంది చిక్కుకుని ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
అపార్టుమెంటు ముందు పార్క్ చేసి ఉన్న కార్లు, ద్విచక్రవాహనాలు ఈ ప్రమాదంలో దగ్ధమయ్యాయి. స్థానికుల ద్వారా ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
ఫైర్ సిబ్బంది నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. అపార్టుమెంటులో మొత్తం 60 కుటుంబాలు నివాసం ఉంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అపార్టుమెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఓ గ్యారేజీ ఉన్నదని, ఆ గ్యారేజీలో కారును రిపేర్ చేస్తుండగా మంటలు చెలరేగాయని డీసీపీ తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోనే డీజిల్, కెమికల్ డ్రమ్ములు ఉండటంతో వాటికి మంటలు అంటుకుని భారీ ప్రమాదం జరిగిందని ఆయన చెప్పారు.
కాగా, సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ నగరంలో రెండు వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. అమీర్‌పేట్ పరిధిలోని మధురానగర్‌లో ఓ ఫర్నీచర్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గోదాంలోని లక్షల విలువైన ఫర్నీచర్ దగ్ధమైంది. అదేవిధంగా పాతబస్తీలోని షాలిబండ ఏరియాలోగల బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో షాప్ లోని ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నీచర్ దగ్ధమైనట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. ఈ ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.