మణిపూర్లో హింసాత్మక సంఘటనల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మెయితీకి చెందిన తీవ్రవాద సంస్థ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పిఎల్ఎ)ని ఐదేళ్ల పాటు చట్టవిరుద్ధమైన సంఘంగా ప్రకటించింది.
ఆ పార్టీ రాజకీయ విభాగాలైన రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ (ఆర్పిఎఫ్), యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ (యుఎన్ఎల్ఎఫ్), దాని సాయుధ విభాగం మణిపూర్ పీపుల్స్ ఆర్మీ(ఎంపిఎ)లను కూడా నిషేధిస్తూ హోం మంత్రిత్వశాఖ ప్రకటించింది.
పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ఆఫ్ కంగ్లీపాక్ (పిఆర్ఇపిఎకె), రెడ్ ఆర్మీ కంగ్లీపాక్ కమ్యూనిస్టు పార్టీ (కెసిపి), కంగ్లీ యవోల్ కంబా లుప్ (కెవైకెఎల్), కో ఆర్డినేషన్ కమిటీ (కోర్ కామ్) ఎలియన్స్ ఫర్ సోషలిస్ట్ యూనిటీ కంగ్లీపాక్ (ఎఎస్యుకె) లను కూడా హోం మంత్రిత్వశాఖ నిషేధించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం 1967 లోని సెక్షన్ 37 కింద ఈ నిషేధాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విధిస్తున్నట్టు ప్రకటించింది.
మయన్మార్లో హింసాత్మక దాడులపై అప్రమత్తం
ఇలా ఉండగా, మయన్మార్ లోహింసాత్మక సంఘటనలు తరచుగా జరుగుతున్న నేపథ్యంలో మయన్మార్ నుంచి చిన్ కుకీ తెగకు చెందిన వారు పెద్ద ఎత్తున దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో వాళ్లను అడ్డుకునేందుకు అస్సాం రైఫిల్స్ అప్రమత్తం అయింది.
స్థానికేతరులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని స్థానికులను అధికారులు కోరుతున్నారు. మయన్మార్ సరిహద్దులోని ఛాంపాయ్ జిల్లా జోఖత్వార్ గ్రామానికి ఇటీవల 100 కుటుంబాలు వచ్చినట్టు సమాచారం. 2021 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఈ గ్రామంలో ఆశ్రయం పొందుతున్న శరణార్థుల కుటుంబాల సంఖ్య 6000 కు పైగా ఉంది.