టీడీపీ- జనసేన పార్టీల మేనిఫెస్టో కమిటీ సోమవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలోజరిపిన భేటీలో 11 అంశాలతో ఉమ్మడి మినీ మ్యానిఫెస్టోను రూపొందించారు. టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, పర్చూరి అశోక్ బాబు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్ లు పాల్గొనగా.;. జనసేన తరపున ముత్తా శశిధర్, డి. వరప్రసాద్, ప్రొఫెసర్ కె. శరత్ కుమార్ లు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఇది కేవలం ప్రాధమిక సమావేశం మాత్రమే అని చెబుతూ గతంలో ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ’ మినీ మేనిఫెస్టో విడుదల చేశామని గుర్తు చేశారు. ఇందులో సూపర్ సిక్స్ అనేదానిపై ప్రచారం చేస్తున్నామని తెలిపారు.
టీడీపీ- జనసేన పొత్తు అనంతరం మొదటి మీటింగ్ రాజమండ్రిలో పవన్, లోకేశ్ లతోపాటు జాయింట్ యాక్షన్ కమిటి సమావేశంలో ఉమ్మడి మేనిఫెస్టో ఉండాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. రెండు పార్టీల నుంచి ఉమ్మడి మేనిఫెస్టో కోసం ఆరుగురి సభ్యులతో కమిటీ ఏర్పాటుచేశామని వివరించారు.
టీడీపీ తరపున 6 అంశాలు, జనసేన తరపున ఆరు అంశాలను ఇవ్వగా రెండు క్లబ్ చేసి మినీ మేనిఫెస్టో తయారు చేశామని యనమల తెలిపారు. అనంతరం పై కమిటీ ఆమోదంకు పంపుతామని చెప్పారు. సమాజంలో అసమానతలు తొలగాలనేదే ఈ మినీ మేనిఫెస్టో ఉద్దేశం అని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ బాగుపడాలని, రైతులకు మేలు జరగాలని, అన్ని రంగాల్లో ప్రజలు మహాశక్తివంతులవ్వాలని భావిస్తున్నామని వివరించారు.
అందుకే మహాశక్తి పథకం ద్వారా ‘తల్లికి వందనం’ పేరుతో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 15,000, ఆడబిడ్డ నిధి నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళలకు నెలకు రూ. 1,500. ‘దీపం’ పేరుతో ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. యువగళం ద్వారా 20 లక్షల మంది యువతకు ఉపాధి, నిరుద్యోగులకు ‘యువగళం నిధి’ నుంచి నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇవ్వడం, సౌభాగ్య పథం ద్వారా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో 20 శాతం గరిష్టంగా రూ.10 లక్షల వరకు సబ్సిడీ ఇచ్చే విషయాన్ని జనసేన పార్టీ ప్రతిపాదించగా ఆమోదించామని యనమల తెలిపారు.