శతాబ్ద కాలంలో ఎన్నడూ చూడని విధంగా ఈనాడు ప్రపంచం కీలక మార్పులకు లోనవుతోందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పేర్కొన్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోకి దక్షిణంగా ఫిలోని ఎస్టేట్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చైనా అధ్యక్షుడు సీజిన్‌పింగ్ భేటీ అయ్యారు.
చైనా, అమెరికాలకు రెండు అవకాశాలు వున్నాయి. సమైక్యతను, సహకారాన్ని పటిష్టపరచుకోవడం, ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు చేతులు కలపడం, అంతర్జాతీయ భద్రత, సంక్షేమాలను పెంపొందించడమన్నది మొదటి అవకాశం కాగా. రెండవది ఘర్షణలు రెచ్చగొట్టడం, యుద్ధాలు ప్రేరేపిస్తూ ప్రపంచ ప్రజల మధ్య చీలికలు తేవడం అని స్పష్టం చేశారు.
ఈ రెండూ పరస్పర విరుద్ధమైనవి. వీటిలో ఏ మార్గం ఎంచుకుంటామనే దానిపైనే ప్రపంచ మానవాళి, ఈ భూమండల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సూటిగా చెప్పారు. చైనా, అమెరికా రెండూ ఒకదాన్ని మరొకటి మార్చడానికి ప్రయత్నించడమనేది పూర్తి అవాస్తవికంగా వుంటుందని జిన్‌పింగ్ చెప్పారు.
అధికార పోటీ అనేది చైనా- అమెరికా, అలాగే ప్రపంచం ఎదుర్కొనే సమస్యలను ఏమాత్రం పరిష్కరించబోదని తేల్చి చెప్పారు. చైనా తనదైన విధానాలు, నిబంధనలతో అభివృద్ది పంథాను రూపొందించుకుందని చెబుతూ పాత వలసవాద విధానాన్ని చైనా అనుసరించదని స్పష్టం చేశారు.
చైనా శాంతియుత పునరేకీకరణకు మద్దతివ్వాలని, తైవాన్‌కు ఆయుధాలివ్వడాన్ని ఆపివేయాలని జిన్‌పింగ్ అమెరికా అధ్యక్షుణ్ణి కోరారు. బైడెన్ ట్వీట్ చేస్తూ తమ ఇరువురి మధ్య చర్చలు బాగానే జరిగాయని, పురోగతి సాధించామని వ్యాఖ్యానించారు.
ఈ భేటీలో ప్రపంచ శాంతి, అభివృద్ధితో బాటు ఇరు దేశాల మిలిటరీల మధ్య కమ్యూనికేషన్ల పునరుద్ధరణ గురించి కూడా చర్చించారు. అక్రమ మందుల సరఫరాను నియంత్రించడంలో పరస్పరం సహకరించుకునేందుకు ఒక వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.
సమానత్వం, గౌరవం ప్రాతిపదికన చైనా – అమెరికా రక్షణ విభాగ వర్కింగ్ గ్రూపుల సమావేశాలు నిర్వహించాలని, సముద్ర జలాల భద్రతపై సంప్రదింపుల యంత్రాంగం సమావేశాలు జరపాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది నుండి రెండు దేశాల మధ్య విమానాల సంఖ్యను గణనీయంగా పెంచాలని నిర్ణయించారు.
విద్య, అంతర్జాతీయ విద్యార్థులు, యువత, సంస్కృతి, క్రీడలు, వాణిజ్యం తదితర రంగాల్లో పరస్పర మార్పిడులను విస్తరించాలని కూడా నిర్ణయించారు. వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కార్యకలాపాలను, చర్యలను వేగవంతం చేయాలన్న నిశ్చయాన్ని పునరుద్ఘాటించారు.