స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట దక్కింది. ఆయనకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ కేసులో టీడీపీ చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కోర్టు తీర్పు వెల్లడించింది. చంద్రబాబు తరఫు లాయర్ల వాదనలతో హైకోర్టు న్యాయమూర్తి ఏకీభవించారు.
ఈ మేరకు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ టి.మల్లికార్జున్‌రావు తీర్పు వెల్లడించారు. రెగ్యులర్ బెయిల్ రావడంతో చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఉన్న కొన్ని నిబంధనలు కూడా తొలగిపోయినట్లే అని లాయర్లు అంటున్నారు. కేసుకు సంబంధించిన అంశాలపై కోర్టు ఎలాంటి షరతులు విధించింది అన్నది స్పష్టత రావాల్సి ఉంటుంది.
ఈ పిటిషన్‌పై వాదనలు ఈనెల 17న ముగియడంతో కోర్టు తీర్పును రిజర్వు చేసింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
రాజకీయంగా పెద్దలు చెప్పినట్లు ఏపీ సీఐడీ నడుచుకుంటోందని చంద్రబాబు తరఫున సీనియర్ లాయర్లు వాదించారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రభుత్వం, సీఐడీ దురుద్దేశపూర్వకంగా చంద్రబాబుపై రాజకీయ కక్షతో తప్పుడు కేసులు నమోదు చేశాయని పేర్కొన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ వాస్తవాలను దాచిపెట్టి అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారని కోర్టులో వాదనలు వినపించారు. వృత్తి విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున బార్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయవచ్చు గానీ, తాము ఆ పని చేయట్లేదని చంద్రబాబు తరఫు లాయర్లు తెలిపారు.
చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ నిబంధనల్ని ఉల్లంఘించారని సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. లొంగిపోయేటప్పుడు రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్‌కు సీల్డ్కవర్లో వైద్యనివేదికలు అందజేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పిటిషనర్ ఉల్లంఘించారని పేర్కొన్నారు.
ఆ నివేదికలు నమ్మశక్యంగా లేవని, బెయిలు మంజూరుకు వాటిని పరిగణనలోకి తీసుకోనక్కర్లేదని తెలిపారు. ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించాలని చెబుతూ మధ్యంతర బెయిలు పొందిన చంద్రబాబు హైదరాబాద్ వెళ్లి ర్యాలీ నిర్వహించి, కోర్టు షరతులను ఉల్లంఘించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ర్యాలీపై బేగంపేట పోలీసులు ఆయనపై కేసు నమోదుచేశారని పేర్కొన్నారు.
ఈ కేసులో ఇతర నిందితులకు బెయిలు మంజూరయిందన్న కారణంతో పిటిషనర్‌కు బెయిలు ఇవ్వాలని లాయర్లు కోరడం సరికాదని చెబుతూ అందువల్ల బెయిలు పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేయగా సోమవారం నిర్ణయాన్ని వెల్లడించారు. చంద్రబాబు స్కిల్ డెవలెప్మెంట్ కేసులో ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్నసంగతి తెలిసిందే.