తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార జోరు పెరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో తీరిక లేెకుండా వివిధ పార్టీల నేతలు గడుపుతున్న పరిస్థితుల్లో మరోసారి ఆదాయపు పన్నుశాఖ అధికారులు పంజా విసిరారు. ఈ సారి కాంగ్రెస్ అభ్యర్థి జీ వివేక్. ఇంటిపై దాడి చేశారు. పలు చోట్ల ఏకకాలంలో ఈ దాడులు ఆరంభం అయ్యాయి..
ఈ ఎన్నికల్లో ఆయన మంచిర్యాల్ జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. మంగళవారం తెల్లవారు జాము నుంచి ఆయన ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నూరులోని వివేక్ నివాసంతో పాటు హైదరాబాద్‌లోని సోమాజీగూడ ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో ఈ దాడులు మొదలయ్యాయి.
వివేక్ బంధువులు, కొందరు ముఖ్య అనుచరుల ఇళ్లపైనా ఐటీ అధికారులు సోదాలకు దిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా 20 చోట్ల ఈ దాడులు సాగుతున్నట్లు సమాచారం. తెలంగాణాలో పోటీలో ఉన్న అభ్యర్థులు అందరిలో సంపన్నుడిగా ఆయన అఫిడవిట్ చూస్తే తేలుతుంది.
మొన్నటి వరకు జీ వివేక్.. బీజేపీలో కొనసాగారు. ఎన్నికల సమీపించిన అనంతరం ఆయన పార్టీ ఫిరాయించారు. సొంత గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ కండువాను కప్పుకొన్నారు. ఐటి దాడులకు నిరసనగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
ఇలా ఉండగా, ములుగు జిల్లా ప్రముఖ పర్యటక కేంద్రమైన రామప్ప గెస్ట్ హౌస్ లో కర్ణాటక కు చెందిన మాజీ కాంగ్రెస్ మంత్రి విడిది చేసినట్టు సమాచారం. కర్ణాటక నుండి భారీగా డబ్బు సంచులు తీసుకొనివచ్చి కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క కోసం పంచడానికి నిలువ ఉంచారని తప్పుడు సమాచారం ఇచ్చారు.
రామప్ప గెస్ట్ హౌస్ లో వద్ద కు బిఆర్ఎస్ నాయకులు, మీడియా ప్రతినిధులు భారీగా చేరుకున్నారు. ఎన్నికల ఫ్లయింగ్ స్క్యాడ్ అధికారులు పోలీసులు గెస్ట్ హౌస్ లో తెల్లవారుజామున మూడు గంటల నుంచి సోదాలు నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించిన డబ్బులు ఇతర వస్తువులు దొరకకపోవడంతో ఫేక్ న్యూస్ అంటూ అధికారులు తిరిగి వెళ్లిపోయారు.