ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం నాలుగు రోజుల పాటు విరామం ప్రకటించాయి. బందీల విడుదల కోసం ఇరువర్గాల మధ్య కాల్పుల విరమణ కోసం కొంతకాలంగా అంతర్జాతీయ సమాజం చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. 50 మంది బందీల విడుదల కోసం ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందం కుదిరింది.
బందీలను విడుదల చేయడానికి, మానవతావాదుల ప్రవేశాన్ని అనుమతించడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం, హమాస్ బుధవారం నాలుగు రోజుల పాటు యుద్ధం విరామానికి అంగీకరించాయి. ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణ పాటించనుంది.
ఆ సమయంలో గాజాలో సైనిక దాడులను నిలిపివేయనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం వెల్లడించింది. అదే సమయంలో హమాస్ తమ వద్ద బందీలుగా ఉన్న 240 మందిలో నుంచి కనీసం 50 మందిని విడిచిపెట్టాల్సి ఉంటుందని తెలిపింది. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులను హమాస్ వదిలేయనున్నట్లు పేర్కొంది.
”బందీలను సురక్షితంగా ఇంటికి తీసుకురావడమే మా లక్ష్యం. ఇందుకోసం తాత్కాలిక కాల్పుల విరమణ చేపట్టేందుకు హమాస్‌తో ఒప్పందానికి ప్రభుత్వం అంగీకరించింది” అని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం తమ ప్రకటనలో వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా తమ జైళ్లలో ఉన్న 150 మంది పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్ విడిచిపెట్టనుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే.. తాజా ప్రకటనలో నెతన్యాహు సర్కారు మాత్రం ఆ విషయాన్ని ప్రస్తావించలేదు.
ఖతార్ మధ్యవర్తిత్వ చర్చల అనంతరం ఇజ్రాయేల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అధ్యక్షతన మంగళవారం రాత్రి క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంధి ఒప్పందాన్ని ఆమోదించారు. ఇది కష్టమైన నిర్ణయం, కానీ ఇది సరైన నిర్ణయం అని మంత్రులకు నెతన్యాహు చెప్పారు. అమెరికా అధికారి ఒకరు మాట్లాడుతూ ఐదు వారాల అత్యంత కీలక చర్చలుగా అభివర్ణించిన ఆయన మంత్రివర్గం ఆమోదం చివరి అవరోధమని పేర్కొన్నారు.
అటు, హమాస్ సైతం మానవతా సంధిని స్వాగతిస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇజ్రాయేల్ జైళ్ల నుంచి 150 మంది పాలస్తీనియన్లను కూడా విడుదల చేస్తుందని పేర్కొంది. ఆక్రమణదారులు (ఇజ్రాయేల్) గౌరవించినంత కాలం ప్రతిఘటన సంధికి కట్టుబడి ఉంటామని తెలిపింది. అక్టోబరు 7న హమాస్ దాడి.. ఇజ్రాయేల్ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన. ఈ నరమేధంలో కనీసం 1,400 మంది ఇజ్రాయేలీలు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, దాదాపు 250 మందిని అపహరించి బందీలుగా చేసుకున్నారు.
ఈ మారణహోమానికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయేల్ సైన్యం వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. భూతల యుద్ధాన్ని ప్రారంభించి హమాస్ స్థావరాలను ధ్వంసం చేస్తోంది. ఆస్పత్రులు, పాఠశాలలు, శరణార్థ శిబిరాలపై ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్ చేస్తున్న దాడులతో వేలాది మంది బలవుతున్నారు. ఇప్పటి వరకూ 14 వేల మంది పాలస్తీనా పౌరులు చనిపోగా.. వీరిలో అధిక శాతం చిన్నారులే కావడం అత్యంత బాధాకరం.
తాజాగా, నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణకు ఇజ్రాయేల్, హమాస్ మధ్య కుదిరిన ఒప్పందంలో అమెరికా, ఖతార్, ఈజిప్టు, దోహా కీలక పాత్ర పోషించాయి. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్, ఇజ్రాయేల్ విదేశీ నిఘా మొసాద్, ఈజిప్టు ఇంటెలిజెన్స్‌లు పాల్గొన్నాయి. గురువారం నుంచి బందీల విడుదల ప్రారంభం కానుండగా.. వీరిలో చిన్నారి అబిగైల్ మోర్ ఇడాన్తో సహా ముగ్గురు అమెరికన్లు ఉన్నారని అమెరికా సీనియర్ అధికారి తెలిపారు.