కరోనా మహమ్మారి విలయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసే వార్త ఇది. కరోనా మహమ్మారికి పుట్టినిల్లయిన చైనాలో మరో మహమ్మారి పురుడు పోసుకుంటున్నదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ముఖ్యంగా పాఠశాలలకు వెళ్తున్న చిన్నారులు ఈ న్యుమోనియా బారిన పడుతున్నట్లు సమాచారం. అయితే ఈ వ్యాధి కరోనా వలే ప్రపంచమంతా వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రోమెడ్ సంస్థ అప్రమత్తం చేసింది. చైనాలోని బడుల్లో అంతుచిక్కని నిమోనియా వ్యాధి విజృంభిస్తున్నది.
బీజింగ్, లియోనింగ్ నగరాల్లోని దవాఖానలు బాధిత చిన్నారులతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో తాజా పరిస్థితులు మునుపటి కరోనా సంక్షోభాన్ని గుర్తుకు తెస్తున్నాయి. మిస్టరీ నిమోనియా వ్యాపిస్తుండటంతో స్కూళ్ల మూసివేత తప్పదని స్థానిక మీడియా వెల్లడించింది.
బీజింగ్, లియోనింగ్ దవాఖానలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు పేర్కొన్నది. బాధిత చిన్నారుల్లో అధిక జ్వరం, ఊపిరితిత్తుల మంట వంటి అసాధారణ లక్షణాలు ఉన్నట్టు తెలిపింది. అయితే ఇతర శ్వాసకోశ వ్యాధుల్లో కనిపించే దగ్గు, ఇతర లక్షణాలు లేవని వివరించింది.
ప్రపంచదేశాల్లో మనుషులు, జంతువుల్లో వ్యాపించే వ్యాధులను ట్రాక్ చేసే సర్వైవలెన్స్ ప్లాట్ఫామ్ ప్రోమెడ్ చైనాలో తాజా నిమోనియా వ్యాప్తి గురించి మంగళవారం బయటపెట్టింది. 2019లో కరోనా వ్యాప్తి గురించి కూడా ఈ సంస్థనే మొదట హెచ్చరించింది.
చైనాలో తాజా శ్వాసకోశ వ్యాధి ఎప్పుడు మొదలైందో స్పష్టంగా తెలియదని పేర్కొన్నది. అలాగే పెద్దలు ఈ వ్యాధికి గురయ్యారా లేదా అన్న విషయాన్ని కూడా వెల్లడించలేదు. మరో మహమ్మారిగా ఇది మారుతుందా అన్నది ఇప్పుడే చెప్పలేమని వివరించింది.
దగ్గు లేకపోయినా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, శ్వాససంబంధ ఇబ్బందులు, జ్వరం వంటి లక్షణాలతో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారని ప్రోమెడ్ సంస్థ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కరోనాలాగా మరో మహమ్మారిగా మారే అవకాశాలపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని వెల్లడించింది. కరోనా ఆంక్షలు సడలించినప్పటి నుంచి చైనా అంటువ్యాధులతో సతమతమవుతోందని పేర్కొంది.
ఉత్తర చైనాలో అంతుచిక్కని న్యుమోనియా లక్షణాలతో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) స్పందించింది. జబ్బు లక్షణాలు, అనారోగ్యానికి గురవుతున్న చిన్నారులుండే ప్రాంతాల వివరాలు ఇవ్వాలని కోరుతూ ఈ జబ్బు వ్యాప్తి చెందకుండా చైనా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.