సొంత మంత్రులకు, పార్టీ నేతలకు, ఉన్నతాధికారులకు సహితం కలవడానికి అందుబాటులో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఒకే రోజున రెండు కమ్యూనిస్ట్ పార్టీల అగ్ర నేతలతో విడివిడిగా కలవడం, రాజకీయ సమాలోచనలు జరపడం విస్మయం కలిగిస్తుంది. పైగా, ఆ పార్టీలతో కలసి `బిజెపి ముక్త్ భారత్’ కోసం పోరాడాలని పిలుపు ఇచ్చిన్నట్లు చెబుతున్నారు.
కాంగ్రెస్ లేని ఫెడరల్ ఫ్రంట్ ద్వారా బిజెపిని ఎదుర్కోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రితో కలసి చాలాకాలంగా చెబుతున్న కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి సన్నిహితుడిగా, ఆమెకు `రాజకీయ సలహాదారుడు’గా పేరొందిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో భేటీ కావడం ఆసక్తి కలిగిస్తుంది. కాంగ్రెస్ లేని కూటమి బిజెపిని ఎదుర్కోలేదని ఆయన స్పష్టంగా చెప్పేసారు కూడా.
ఏచూరితో పాటు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, త్రిపుర మాజీ సిఎం మాణిక్ సర్కార్, సిపిఎం కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యులు రామచంద్రన్ పిళ్లై , బాల కృష్ణన్, ఎం ఎ బేబీ వంటి అగ్రనేతలను ఆహ్వానించి ప్రగతి భవన్ లో వారికి విందు ఇచ్చారు. అయితే ఈ భేటీకి తెలంగాణ సిపిఎం నాయకులు హాజరు కాకపోవడం విస్మయం కలిగిస్తుంది.
ఇప్పటికే తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్న కేసీఆర్ తో తాము చేతులు కలుపుతున్నట్లు కనిపిస్తే తెలంగాణలో తమకు రాజకీయంగా చేటు చేస్తుందనే భయంతోనే వారు ఈ భేటీకి దూరంగా ఉన్నట్లు భావించవలసి వస్తుంది.
మరోవంక, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సిపిఐ పార్లమెంటరీ పార్టీ పక్షనేత, కేరళ ఎంపీ బినయ్ విశ్వం, కేరళ రెవిన్యూశాఖ మంత్రి రాజన్, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డిలతో పాటు కేంద్ర, రాష్ట్ర సిపిఐ అగ్రనేతలు కేసీఆర్ ను కలిసినవారిలో ఉన్నారు.
ఈ రెండు పార్టీల నేతలతో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఏ విధంగా అడ్డుకోవాలనే విషయంపైననే చర్చించినట్లు మీడియాకు చెప్పారు. అయితే తమ భేటీల గురించి రెండు కమ్యూనిస్ట్ పార్టీల నేతలు అధికారికంగా మీడియాకు ఎటువంటి సమాచారం ఇవ్వక పోవడం గమనార్హం.
అకారణంగా సొంత కార్యాలయంలో నిరసన చేపట్టిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను దౌర్జన్యంగా అరెస్ట్ చేయడంతో ఒక వంక ఉన్నత న్యాయస్థానం నుండి `చెంపదెబ్బలు’ తప్పక పోగా, మరోవంక, ప్రధాని నుండి బిజెపి అగ్రనేతలందరూ సంజయ్ కు బాసటగా నిలబడడంతో కేసీఆర్ కోలుకోలేని దిగ్బ్రాంతికి గురైనట్లు కనిపిస్తున్నది.
అందుకనే దిక్కుతోచక వామపక్షాలతో భేటీ అయిన్నట్లు స్పష్టం అవుతున్నది. అయితే బూడిద, బూడిద రాసుకొనే ప్రయోజనం ఏమిటన్నట్లు తమ సొంత రాజకీయ ఉనికి ప్రశ్నార్ధకరంగా మారుతున్న వామపక్షాలు ఆయనకు ఎటువంటి బలం చేకూర్చగలవు?
సిపిఎం కేరళకు పరిమితమయింది. సిపిఐ అయితే దాదాపు రాజకీయంగా ఉనికి కోల్పోతున్నది. కార్మిక, విద్యార్హ్ది, యువజన రంగాలలో ఈ పార్టీల ప్రాబల్యం ఘోరంగా సన్నగిల్లింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఒకొక్క ఎన్నికలో ఒకొక్క పెద్ద పార్టీతో పొత్తు పెట్టుకొని, శాసనసభలో తమ ప్రాతినిధ్యం కాపాడుకొంటూ వచ్చాయి.
అయితే, రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి ఈ రెండు పార్టీలతో పొత్తుకు ఎవ్వరు సుముఖత వ్యక్తం చేయడం లేదు. దానీతో వారి ఉనికి ప్రశ్నార్ధకరంగా మారింది. ఉనికి కోసం ఆరాటపడుతున్న పార్టీలతో చేతులు కలిపి దిగజారుతున్న తన పార్టీ, ప్రభుత్వం ప్రాబల్యాన్ని కాపాడుకోవడం కేసీఆర్ కు ఏమాత్రం సాధ్యం అవుతుందో అర్ధం కావడం లేదు.
ఏచూరి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి సహితం సన్నిహితుడు కావడం గమనార్హం. విందు అనంతరం సీపీఎం నేతలతో గంటన్నరపాటు కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇద్దరు సీఎంలు జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం.
దేశంలో బీజేపీని ఎలా నిలువరించాలనే అంశంపైనే కేసీఆర్, కమ్యూనిస్టు పెద్దలు ప్రధానంగా సమాలోచనలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో ఉనికి కోల్పోతున్న సిపిఎం ఒక్క సీట్ కూడా తేల్చుకోలేక పోయింది. పైగా ఆ పార్టీతో పొత్తుకు ఎవ్వరు ముందుకు రావడం లేదు.
మరోవంక, కాంగ్రెస్ లేకుండా బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటుకు మమతా బనెర్జీ చేస్తున్న ప్రయత్నాల పట్ల సిపిఎం ఆందోళన చెందుతున్నది. పశ్చిమ బెంగాల్ లో సిపిఎం తో పోరాడవలసి రావడమే కారణం. అందుచేత కేసీఆర్ తో సాన్నిహిత్యం జాతీయ రాజకీయాలలో సహితం తమ ఉనికి కాపాడుకోవడానికి సహకరిస్తుందని కూడా భావిస్తున్నట్లు కనిపిస్తున్నది.