తెలంగాణాలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వికారాబాద్ జిల్లాలోని కొండగల్ కు చెందిన బీఆర్ఎస్ శాసన సభ్యుడు పట్నం నరేందర్ రెడ్డిపై కేసు నమోదైంది. హత్యాయత్నం, కిడ్నాప్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆయనతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, మరో ఆరు మందిపై ఈ కేసు నమోదైంది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు పెట్టారు. ఇందులో ఏ1గా పట్నం నరేందర్ రెడ్డి పేరును నమోదు చేశారు.
కోస్గిలో కూర నరేష్ అనే వ్యక్తిపై దాడి చేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. కోస్గిలో తమ కారుకు సైడ్ ఇవ్వలేదనే కారణంతో బైక్‌పై వెళ్తోన్న కూర నరేష్‌పై పట్నం నరేందర్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్, వారి అనుచరులు కర్రలతో దాడి చేసి చితగ్గొట్టినట్లు ఫిర్యాదులో పొందుపరిచారు. తనను హత్య చేయడానికి ప్రయత్నించారని బాధితుడు పేర్కొన్నాడు.
తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వటంతోనే తనపై దాడిచేసి చంపాలని చూశారని బాధితుడు కూర నరేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు పట్నం నరేందర్ రెడ్డిపై ఐపీసీలోని 30 7, 147, 148, 341, 392, 171- ఎఫ్ 504, 505, 149, మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 192 కింద కేసు నమోదు చేశారు. ఇక్కడి నుండి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీచేస్తున్నారు. గత ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్యెల్యేగా ఆయన ఓటమి చెందారు.