రైతుబంధు నిధుల విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం నిరాకరించింది.రెండు రోజల క్రితం రైతుబంధు నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ అనుమయిచ్చింది. అయితే, న్నికల ప్రచార సభలపై రైతుబంధు గురించి ప్రస్తావించరాదని, ఎన్నికల్లో లబ్ధిపొందేలా వ్యాఖ్యలు చేయరాదని ఈసీ ముందే షరతు విధించింది.
అయినా, బీఆర్ఎస్ నాయకులు రైతుబంధును ప్రస్తావించారని పేర్కొంటూ సీఈసీ నిబంధనలు ఉల్లంఘించడంతో రైతుబంధు నిధుల విడుదలకు అనుమతిని ఈసీ ఉపసంహరించుకుంది. హరీశ్ రావు తన సభల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రసంగించారని ఈసీ పేర్కొంది. ఈసీ నిర్ణయంతో రైతుబంధు నిధుల విడుదలకు బ్రేక్ పడింది.
కాగా, రైతుబంధుకు ఈసీ అనుమతి ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. నవంబర్ 30న ఎన్నికలు జరగునున్న నేపథ్యంలో రెండు రోజుల ముందు రైతు బంధు నిధుల విడుదలకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలా అనుమతిస్తారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. మోడీ చెప్పడంతోనే కేసీఆర్ కు.. ఈసీ అనుమతి ఇచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది.
ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)కి మూడు లేఖలు రాసింది. రైతు రుణమాఫీ అమలు, ఉద్యోగులకు మూడు డీఏల విడుదల, రైతుబంధుకు అనుమతి కోసం ఈ లేఖలు రాశారు. అయితే రుణమాఫీ అమలు, ఉద్యోగులకు డీఏలు విడుదల చేసేందుకు ఈసీ అనుమతించలేదు.
కానీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రైతుబంధు పథకం అమలుకు ఓకే చెప్పింది. ఈనెల 28 వరకల్లా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసుకోవచ్చునని తెలిపింది. అభ్యంతరాలు రావటంతో తాజాగా..రైతు బంధు విషయంలో ఎన్నికల సంఘం అనుమతిని నిరాకరించింది.
తెలంగాణలో వానాకాలంతో పాటు యాసంగి సీజన్ ఆరంభానికి ముందు పంట పెట్టుబడి సాయంగా నిధులు విడుదల చేస్తూ ఉంటారు. ప్రతి ఏటా ఒక్కో సీజన్‌కు ఎకరానికి రూ.5 వేల చొప్పున రెండు సీజన్లకు మొత్తం రూ.10 వేలను రైతుల ఖాతాల్లో నేరుగా ప్రభుత్వం జమ చేస్తోంది.
ఈసారి శాసనసభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రభుత్వం నుంచి యాసంగి సీజన్‌కు నిధుల జమ జరగలేదు. ఇది కొనసాగుతున్న పథకమని కోడ్ వర్తించదని.. యథావిధిగా ఈ సాయం విడుదలకు అనుమతించాలని ప్రభుత్వం ఈసీని కోరింది.
పరిశీలించిన ఈసీ ఈనెల 24న నిధుల జమకు అనుమతి మంజూరు చేసింది. ఈనెల 30న పోలింగ్ ఉన్నందున.. 28లోగా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. తాజాగా ఆ అనుమతిని ఎన్నికల సంఘం ఉపసంహరించుకుంది.