తెలంగాణాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగినప్పటికీ పోలింగ్ తక్కువగా జరగడం, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో నిరాశాజనకంగా ఉండటంతో ఫలితాల పట్ల ఉత్కంఠత వ్యక్తం అవుతున్నది. అధికార పార్టీ బిఆర్ఎస్ పట్ల ప్రజలు ప్రతికూలంగా స్పందించినట్లు భావిస్తున్నప్పటికీ, కాంగ్రెస్ పట్ల మొగ్గు ఉన్నట్లు చెబుతున్నప్పటికీ ఎగ్జిట్ పోల్స్ పరిశీలిస్తే `హంగ్ అసెంబ్లీ’ తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి.
రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే 60 సీట్లు మార్కును దాటాల్సి ఉంటుంది. అలా దాటితినే సింగిల్ గా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఫలితాలు ఉంటే మాత్రం హంగ్ కు అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అదే జరిగితే బిజెపి, ఎంఐఎం `కింగ్ మేకర్’గా మారే అవకాశాలు ఉన్నాయి.
జన్ కీ బాత్ సర్వే చూస్తే… బీఆర్ఎస్ పార్టీకి 40-55 సీట్లు వస్తాయని తెలపగా, కాంగ్రెస్ పార్టీకి 48-64 సీట్లు దక్కుతాయని అంచనా వేసింది. బీజేపీ 7-13, ఎంఐఎం – 4-7 సీట్లలో గెలిచే అవకాశం ఉందని అభిప్రాయపడింది.
రిపబ్లిక్ – మాట్రిజ్ సర్వేలో కాంగ్రెస్ కు 58-68, బీఆర్ఎస్ కు 46-56 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. బీజేపీకి 4-9 సీట్లు రావొచ్చని పేర్కొంది. వీరి సర్వే ప్రకారం చూస్తే తెలంగాణలో హంగ్ రావొచ్చని చెప్పొచ్చు. జన్ కీ బాత్ సర్వే కూడా ఇదే విషయాన్ని బలపరుస్తున్నట్లు కనిపిస్తోంది.
సిఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే కాంగ్రెస్-56 సీట్లు, బీఆర్ఎస్-48, బీజేపీ-10,ఎంఐఎం-5 సీట్లు గెలుస్తుందని తెలిపింది. వీరి లెక్క ప్రకారం కూడా హంగ్ కే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. టివి9 భారత్ వర్ష – పోల్ స్టార్ట్ వారి ఎగ్జిట్ పోల్స్ లో బీఆర్ఎస్ కు 48-58 సీట్లు, కాంగ్రెస్ కు 49-59 సీట్లు వస్తాయని అంచనా వేసింది. వీరి సర్వేలో కూడా స్పష్టమైన మెజార్టీ మార్క్ దాటినట్లు కనిపించటం లేదు.
అయితే, కాంగ్రెస్‌కు తెలంగాణ ఓటర్లు పట్టం కట్టబోతున్నట్లు పీపుల్స్‌పల్స్- సౌత్‌ఫస్ట్ ఎగ్టిట్ పోల్స్ వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ 62-72 సీట్లు కైవసం చేసుకుంటుందని… బీఆర్ఎస్ 35-46, బిజెపి 3-8, ఎంఐఎం 6-7, ఇతరులు 1-2 స్థానాలు గెలుపొందే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ఏకపక్షంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేసింది.
మరోవంక, తెలంగాణ ప్రజలు మళ్లీ బీఆర్ఎస్కే పట్టం కట్టబోతున్నారని సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్(సిపిఎస్) ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసింది. బీఆర్ఎస్ 72కి పైగా స్థానాల్లో గెలుస్తుందని సీపీఎస్ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించింది. 43 శాతం మంది ఓటర్లు బీఆర్ఎస్ వెంట ఉన్నారని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీకి 38 శాతం ఓట్లు వచ్చినప్పటికీ.. 36(+or-5) స్థానాలకే పరిమితం కానుందని తెలిపింది.
బీఆర్ఎస్ పార్టీ 68కి పైగా సీట్లలో గెలవబోతుందని పొలిటికల్ గ్రాఫ్ వెల్లడించింది. కాంగ్రెస్‌కు 38, బీజేపీకి 5, ఇతరులు 8 స్థానాల్లో గెలుస్తారని అంచనా వేసింది. బీఆర్ఎస్ పార్టీ 61 -68 స్థానాల్లో గెలుస్తుందని థర్డ్ విజన్ నాగన్న ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. కాంగ్రెస్ 34-40, బీజేపీ 3-5, ఇతరులు 5-8 స్థానాల్లో గెలవబోతున్నారని అంచనా వేసింది. థర్డ్ విజన్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీఆర్ఎస్ 60-68 స్థానాల్లో గెలవనుంది. కాంగ్రెస్ 33-40, బీజేపీ 1-4 స్థానాల్లో, ఇతరులు 0-1 శాతం గెలుస్తుందని పేర్కొంది.