తెలంగాణలో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. లోక్ సభలో భద్రతా ఉల్లంఘనపై హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు వాకౌట్ చేయగా వారి గైర్హాజరీలోనే కేంద్రీయ విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లు-2023ను ఎగువ సభ మూజువాణి ఓటు ద్వారా ఆమోదించింది.
కేంద్రీయ విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లు, 2023కు లోక్ సభ గత వారం ఆమోదం తెలిపింది. దీనిపై చర్చకు సమాధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం తెలంగాణలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు తప్పనిసరి అని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి క్యాంపస్‌ను ప్రారంభించామని, తెలంగాణ ప్రభుత్వం సరైన సమయంలో సహకరించి ఉంటే ఈపాటికి ఈ విశ్వవిద్యాలయం వచ్చి ఉండేదని తెలిపారు. భూమి ఇవ్వడానికి చాలా సమయం పట్టిందని, అందువల్ల అమలులో జాప్యం జరిగిందని పేర్కొన్నారు.
బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత విశ్వవిద్యాలయాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించి జాతీయ సంస్థగా పనిచేసేలా అన్ని ప్రక్రియలను త్వరితగతిన చేపడతామని మంత్రి సభకు హామీ ఇచ్చారు. జాతీయ విద్యావిధానం 2020 ద్వారా చరిత్రను తిరగరాయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలను ప్రధాన్ ఈ సందర్భంగా తోసిపుచ్చారు.
కేంద్రీయ విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లు, 2023 ద్వారా సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేరుస్తుంది. ప్రతిపాదిత సంస్థ తెలంగాణ ప్రజలకు ఉన్నత విద్య, పరిశోధన సౌకర్యాలను సులభతరం చేస్తుంది. భారత దేశంలోని గిరిజన ప్రజలకు గిరిజన కళలు, సంస్కృతి మరియు ఆచారాలు సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతిలో బోధన, పరిశోధన సౌకర్యాలను అందించడం ద్వారా అధునాతన జ్ఞానాన్ని ప్రోత్సహిస్తుంది.
గిరిజన విద్యపై దృష్టి సారించడంతో పాటు, ఇతర కేంద్రీయ విశ్వవిద్యాలయాల మాదిరిగానే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం అన్ని విద్యా, ఇతర కార్యకలాపాలను నిర్వహిస్తుంది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టం, 2009, వివిధ రాష్ట్రాల్లో బోధన, పరిశోధన కోసం విశ్వవిద్యాలయాలను స్థాపించి, విలీనం చేయడానికి రూపొందింది. ఈ చట్టాన్ని ఎప్పటికప్పుడు మారుస్తున్నారు.
