సింగపూర్ ప్రభుత్వం మళ్లీ మాస్క్‌ను తప్పనిసరి చేసింది. విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులు మస్ట్‌గా మాస్క్‌ను ధరించాలనే నిబంధనను తీసుకొచ్చింది. అంతేకాదు ప్రయాణికుల టెంపరేచర్ చెక్ చేసేందుకు థర్మల్ స్కానర్లను కూడా పునరుద్ధరించింది.
కరోనావైరస్కు సంబంధించిన కొత్త వేరియంట్ల కారణంగా శ్వాసకోశ సమస్యలు వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో సింగపూర్ ప్రభుత్వం మళ్లీ ట్రావెల్ నిబంధనలను అమలు చేస్తున్నది. ఫ్లూ, న్యుమోనియా, ఇతర శ్వాసకోశ వ్యాధులను నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
జనాభాలో రోగ నిరోధక శక్తి తగ్గడంతో పాటు క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకల కారణంగా ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తుంటారు. చాలామందిని కలుస్తుంటారు. ఈ కారణంగా వైరస్ వ్యాప్తి ఎక్కువయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా కొవిడ్ నిబంధనలను అమలు చేస్తున్నామని వివరించింది.
సింగపూర్‌తో పాటు ఇండోనేసియా కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. కొవిడ్-19 కేసులు పెరుగుతున్న దేశాలకు, ప్రాంతాలకు వెళ్లొద్దని ప్రజలకు ఇండోనేసియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవాలని, మాస్కులు ధరించాలని చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, వీలైనంత వరకు ఇంటివద్దనే ఉండాలని కోరింది.
మలేసియాలో కరోనా కేసులు దాదాపు రెట్టింపయ్యాయి. డిసెంబర్ 2 ముందు వరకు 3,626 కేసులు నమోదవ్వగా.. వారం రోజుల్లోనే ఆ సంఖ్య 6,796కు పెరిగింది. దీంతో ఇండోనేసియా అధికారులు సరిహద్దు చెక్పాయింట్ల వద్ద థర్మల్ స్కానర్లను ఏర్పాటు చేశారు. ఫెర్రీ టెర్మినల్, జకార్తాలోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనూ కరోనా వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టారు.
దక్షిణాసియాలోని పలు దేశాల్లో తిరిగి కరోనా నియంత్రణ చర్యలు అమలవుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహమ్మారి విజృంభణ సమయంలో ఆసియాలో కఠినమైన నిబంధనలు అమలయ్యాయి. ఇటీవల సింగపూర్ ఉప ప్రధాని లారెన్స్ వాంగ్ తన ఫేస్బుక్ ఖాతాలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం కఠినమైన నిబంధనలను పునరుద్ధరించాలని చూస్తోందని ప్రకటించడంతో సింగపూర్‌వాసుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.