గడిచిన తొమ్మిదిన్నర ఏళ్ళల్లో చాలా సంస్థలు విధ్వంసానికి గురయ్యాయని చెబుతూ పదేళ్ల నిర్బంధ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిందని గవర్నర్ డా. తమిళిసై సౌందరాజన్ తెలిపారు. ప్రజాకవి కాళోజీ కవితతో తెలంగాణ ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా తమ ప్రభుత్వం సమాన దృష్టితో చూస్తుందని ఆమె హామీ ఇచ్చారు. అణిచివేతకు, వివక్షకు గురైన ప్రతి వర్గానికి తమ ప్రభుత్వంలో స్థానం ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. గ్రామీణ అభివృద్ధిలో గత ప్రభుత్వం ప్రచారానికే పరిమితం అయ్యిందని ధ్వజమెత్తుతూ ప్రతి గ్రామ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
రైతుల సంక్షేమ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పేరుతో పోర్టల్ తెస్తామని హామీ ఇచ్చామని చెబుతూ కార్యచరణ రూపొందిస్తామని ఆమె వెల్లడించాయిరు. మార్పు ఫలాలు ప్రజలకు చేరుతున్నాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తొందర్లోనే అమలు చేస్తామని ప్రభుత్వం పేర్కొందని ఆమె గుర్తు చేశారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో విద్యుత్ సంస్థలు రూ.81,516 కోట్లు అప్పుల్లో ఉందని చెబుతూ 50 వేల 275 కోట్ల నష్టంలో విద్యుత్ సంస్థ కొనసాగుతుందని, పౌర సరఫరాల శాఖ 56 వేల కోట్లు అప్పుల్లో ఉందని ఆమె వివరించారు.
గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని గవర్నర్ తెలిపారు. ఎన్నికల సందర్భంగా యువతకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చుతాం అని గవర్నర్ స్పష్టం చేశారు. ఏడాది లోపు తమ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తుందని, ఆరు నెలల్లో మెగా డీఎస్సీ నిర్వహించి, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని ఆమె వెల్లడించారు.
రైతులు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ, యువత, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులు ఇలా ప్రతీ వర్గాన్ని పరిగణనలోకి తీసుకుని సంక్షేమం, అభివృద్ధి కార్యాచరణ ఉంటుందని ఆమె చెప్పారు. యువత జాబ్ క్యాలెండర్ విషయంలో చెప్పిన మాట ప్రకారం కార్యాచరణ ఉంటుందని గవర్నర్ స్పష్టం చేశారు.
అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలం, గౌరవభృతి ఇస్తామని గవర్నర్ ప్రకటించారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తామని ఆమె స్పష్టం చేశారు. రూ. 2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ఉంటుందని, అసైన్డ్, పోడు భూములకు త్వరలోనే పట్టాల పంపిణీ చేపడుతాం అని గవర్నర్ తెలిపారు.